ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మిడ్-అట్లాంటిక్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వరుస సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాల్లో మరో చిరస్మరణీయ ఘట్టంగా ‘నాన్నతో నడక’ (Walk with Dad) కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఫాదర్స్ డే సందర్భంగా జూన్ 21న పెన్సిల్వేనియాలోని వ్యాలీ ఫోర్జ్ నేషనల్ హిస్టారికల్ పార్క్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి తండ్రులు, పిల్లలు పెద్ద సంఖ్యలో హాజరై సందడి చేశారు.
జూలై 2025 నుంచి తానా మిడ్-అట్లాంటిక్ విభాగం వరుసగా కమ్యూనిటీ కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తోంది. ఆ క్రమంలో ఇది 40వ కార్యక్రమం కావడం విశేషం. ‘నాన్నతో నడక’ పేరుతో నిర్వహించిన ఈ ప్రత్యేక వేడుక తండ్రి-పిల్లల అనుబంధాన్ని మరింత బలోపేతం చేస్తూ, ప్రతి ఒక్కరికీ తమ తండ్రితో గడిపిన మధుర జ్ఞాపకాలను గుర్తు చేసింది.
ఈ కార్యక్రమంలో తానా అధ్యక్షుడు డా. నరేన్ కొడాలి, తానా బోర్డ్ డైరెక్టర్ రవి పొట్లూరి, తానా మిడ్-అట్లాంటిక్ రీజినల్ రిప్రజెంటేటివ్ ఫణి కంతేటి, అలాగే కార్యక్రమానికి సూచనలు, మార్గదర్శకత్వం అందించిన తానా బెనిఫిట్ కోఆర్డినేటర్ వెంకట్ సింగు పాల్గొని కార్యక్రమాన్ని అభినందించారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ సినీ నటుడు సుమన్ తల్వార్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రతి ఒక్కరి జీవితంలో తండ్రి పాత్ర ఎంత గొప్పదో ఆయన తన ప్రసంగంలో హృద్యంగా వివరించారు. అనంతరం తండ్రులు, పిల్లలతో కలిసి ఫోటోలు దిగుతూ అందరితో ఆత్మీయంగా మమేకమయ్యారు.
వేడుకను మరింత ఉత్సాహభరితంగా మార్చుతూ మిమిక్రీ రమేష్ తన వినోదభరిత ప్రదర్శనలు, పాటలతో ప్రేక్షకులను అలరించారు. అలాగే మఖ్దూమ్ సయ్యద్, ఉమాకాంత్ చేసిన స్ఫూర్తిదాయక ప్రసంగాలు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
దాదాపు 200 మందికి పైగా తండ్రులు, వారి పిల్లలు ఈ కార్యక్రమంలో పాల్గొని ఫాదర్స్ డేను ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు.
కార్యక్రమం విజయవంతం కావడంలో విశేషంగా కృషి చేసిన సురేష్ యలమంచికి నిర్వాహకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే సునీల్ కోగంటి, రంజిత్ మామిడి, శ్రీధర్ సాదినేని, దీప్తి కోక, సంతోష్ రౌతు, చలం పావులూరి, కృష్ణ నందమూరి, విశ్వనాథ్ కోగంటి, ప్రసాద్ కస్తూరి అందించిన సహకారాన్ని కొనియాడారు.
ఈ కార్యక్రమం కోసం అంకితభావంతో పనిచేసిన వాలంటీర్లందరికీ ‘వాలంటీర్ సర్వీస్ అవర్ సర్టిఫికేట్లు’ అందజేశారు. కార్యక్రమానికి హాజరైన వారందరికీ మధ్యాహ్న భోజన ఏర్పాట్లు చేసి, ప్రతి కుటుంబానికి ఈ వేడుకను చిరస్మరణీయమైన అనుభూతిగా మలిచారు.
తండ్రి-పిల్లల అనుబంధాన్ని మరింత బలోపేతం చేస్తూ, కుటుంబ విలువలను చాటి చెప్పిన ‘నాన్నతో నడక’ కార్యక్రమం తానా మిడ్-అట్లాంటిక్ నిర్వహించిన అత్యంత విజయవంతమైన వేడుకల్లో ఒకటిగా నిలిచింది.





















