అమెరికాలోని నార్త్ కరోలినా రాష్ట్రం, ఛార్లెట్ నగరం తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (టీటీఏ) మెగా కన్వెన్షన్–2026కు వేదిక కానుంది. జూలై 17 నుంచి 19 వరకు మూడు రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించనున్న ఈ మహాసభల ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. టీటీఏ అధ్యక్షుడు నవీన్ రెడ్డి మల్లిపెద్ది నాయకత్వంలో నిర్వాహక బృందం అన్ని ఏర్పాట్లను ముమ్మరంగా చేపట్టింది. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు, విద్య, వ్యాపారం, వైద్యం, సాహిత్యం, వినోదాన్ని ఒకే వేదికపైకి తీసుకురావడమే ఈ మహాసభల ప్రధాన లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.
భారత్, అమెరికా నుంచి వేలాది మంది తెలుగు ప్రజలతో పాటు రాజకీయ, సినీ, వ్యాపార, వైద్య, సాంస్కృతిక రంగాలకు చెందిన ప్రముఖులు ఈ మహాసభలకు హాజరుకానున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులను నిర్వాహకులు ఆహ్వానించారు. సినీ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి, ప్రముఖ వైద్యులు డా. గురవారెడ్డి, డా. నాగేశ్వర్ రెడ్డి, డా. వేణుమాధవ్ రెడ్డి, వ్యాపారవేత్త డా. ఎం.ఎస్. రెడ్డితో పాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొననున్నారు. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, నటులు జేడీ చక్రవర్తి, సునీల్, నవీన్ పొలిశెట్టి తదితరులకు కూడా ఆహ్వానం పంపినట్లు తెలిపారు.
మూడు రోజుల పాటు జరిగే ఈ మహాసభల్లో అన్ని వయసుల వారిని ఆకట్టుకునేలా విభిన్న కార్యక్రమాలు సిద్ధం చేశారు. బిజినెస్ మరియు స్టార్టప్ సెమినార్లు, సీఎంఈ కార్యక్రమాలు, మహిళల కోసం ఉమెన్స్ ఫోరం, యువత కోసం యూత్ బ్యాంక్వెట్, రాజకీయ అంశాలపై పొలిటికల్ ఫోరం, మెట్రిమోనీ మీట్ అండ్ గ్రీట్, శ్రీనివాస కళ్యాణం, అవార్డు ప్రదానోత్సవాలు, తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే ప్రత్యేక ప్రదర్శనలు నిర్వహించనున్నారు. నేటి తరానికి, భావితరాలకు తెలంగాణ సంప్రదాయాలను చేరవేయాలనే ఉద్దేశంతో ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలను రూపొందించినట్లు నిర్వాహకులు తెలిపారు.
వినోద కార్యక్రమాలు ఈ మహాసభలకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. తొలి రోజు బ్యాంక్వెట్ సందర్భంగా ఆరెంజ్ స్ట్రీట్ బ్యాండ్ సంగీత విభావరి, రెండో రోజు థియరీ బ్యాండ్ లైవ్ కాన్సర్ట్, చివరి రోజు ఆస్కార్ విజేత సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి సంగీత విభావరి ప్రేక్షకులను అలరించనుంది. పరంపర నృత్య బృందం ప్రత్యేక నృత్య ప్రదర్శనలు, గ్రెగొరీ హ్యాంకాక్ డ్యాన్స్ థియేటర్ కళాకారుల ప్రదర్శనలు కూడా ఈ వేడుకలకు మరింత ఆకర్షణగా నిలవనున్నాయి.
సాహిత్యాభిమానుల కోసం కూడా ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. సంగీత దశావధానం పేరుతో నిర్వహించే వినూత్న కార్యక్రమంలో సంగీత విద్వాంసుడు శరత్ చంద్ర పాల్గొననున్నారు. గేయకారులకు అంకితమైన "గీతాంజలి" కార్యక్రమాన్ని ప్రముఖ గేయరచయిత, గాయకుడు, సంగీత దర్శకుడు కాసర్ల శ్యామ్ ఆధ్వర్యంలో నిర్వహించనుండగా, శారదా అకునూరి, ధీరజ్ ప్రత్యేక ప్రదర్శనలు ఇవ్వనున్నారు. "సాహిత్యోపన్యాస సుమం" కార్యక్రమంలో ప్రముఖ హృద్రోగ నిపుణుడు, సాహిత్యవేత్త డా. అల్లా శ్రీనివాస్ రెడ్డి ప్రసంగించనున్నారు. అలాగే జానపద, సాంప్రదాయ గీతాల కార్యక్రమంలో ప్రముఖ గాయని, పేరడీ కళాకారిణి డా. అరుణా సుబ్బారావు తన గానంతో అలరించనున్నారు.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల వైభవాన్ని ప్రపంచ వేదికపై చాటిచెప్పే లక్ష్యంతో నిర్వహిస్తున్న టీటీఏ మెగా కన్వెన్షన్–2026కు భారీ ఎత్తున స్పందన లభిస్తోందని నిర్వాహకులు తెలిపారు. మూడు రోజుల పాటు సాంస్కృతిక వైభవం, విజ్ఞానం, వినోదం, వ్యాపార అవకాశాలతో ఈ మహాసభలు తెలుగు ప్రజలకు చిరస్మరణీయ అనుభూతిని అందించనున్నాయని వారు పేర్కొన్నారు.















