అమెరికాలోని వాషింగ్టన్ తెలంగాణ అసోసియేషన్ (WATA) ఆధ్వర్యంలో Scholastic Chess Tournament 2026 ను ఘనంగా నిర్వహించారు. ఈ టోర్నమెంట్‌లో పలువురు చిన్నారులు, యువ చెస్ క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు. కుటుంబ సభ్యుల సందడి, క్రీడాకారుల ఉత్సాహంతో టోర్నమెంట్ ప్రాంగణం కళకళలాడింది.
చిన్నారుల్లో పోటీ తత్వంతో పాటు క్రీడాస్ఫూర్తిని పెంపొందించే లక్ష్యంతో ఈ టోర్నమెంట్‌ను నిర్వహించారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో సహకరించిన వాలంటీర్లు, నిర్వాహకులు, కోచ్‌లు, సపోర్టర్లకు నిర్వాహకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
టోర్నమెంట్ సమన్వయం, నిర్వహణలో జగదీష్ అందించిన సహకారాన్ని నిర్వాహకులు ప్రత్యేకంగా అభినందించారు. అలాగే Think Build Grow Academy Kids సంస్థతో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనందంగా ఉందని తెలిపారు.
ఈ సందర్భంగా WATA ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యులు, ముఖ్యంగా వంశీ రెడ్డి కంచరకుంట్ల, చిన్నారులను ఉద్దేశించి ప్రోత్సాహకరమైన మాటలు చెప్పారు. పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్క క్రీడాకారుడిని అభినందిస్తూ.. గెలుపోటములతో సంబంధం లేకుండా నేర్చుకోవడం, క్రీడాస్ఫూర్తితో ముందుకు సాగడం ముఖ్యమని ప్రోత్సహించారు.
చిన్నారుల ప్రతిభను ప్రోత్సహిస్తూ, కమ్యూనిటీని ఒక్కతాటిపైకి తీసుకొచ్చిన ఈ చెస్ టోర్నమెంట్ విజయవంతంగా ముగిసింది.


























