అమెరికాలోని నార్త్ కరోలినాలో జరుగుతున్న తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (టీటీఏ) మెగా కన్వెన్షన్ 2026 వేదికగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. షార్లెట్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రవాస తెలుగు కుటుంబాలు పెద్ద సంఖ్యలో హాజరై వైఎస్సార్‌కు ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా వైఎస్సార్ ప్రజా సేవ, సంక్షేమ పాలన, రైతులు, పేదలు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన చేసిన సేవలను వక్తలు గుర్తు చేశారు. ప్రజల కోసం అంకితభావంతో పనిచేసిన నాయకుడిగా వైఎస్సార్ చిరస్థాయిగా నిలిచారని కొనియాడారు.
టీటీఏ కన్వెన్షన్‌లో నిర్వహించిన ఈ జయంతి కార్యక్రమం భావోద్వేగపూరిత వాతావరణంలో సాగింది. వైఎస్సార్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన అనంతరం ఆయన ఆశయాలను కొనసాగించాలనే సంకల్పాన్ని పలువురు వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో టీటీఏ నాయకులు, నిర్వాహకులు, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రవాస భారతీయులు, తెలుగు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. "ప్రజల కోసం జీవించిన నాయకుడు... తరతరాలకు స్ఫూర్తిగా నిలిచే వారసత్వం" అనే సందేశంతో నిర్వహించిన ఈ వేడుక అందరినీ ఆకట్టుకుంది.


















