యూకేకు చెందిన పాపులర్ యూట్యూబ్ ఛానెల్ ‘నందూస్ వరల్డ్’ నిర్వాహకురాలు, ఎన్‌ఆర్‌ఐ రామ నందన అరెస్ట్ వ్యవహారం సంచలనంగా మారింది. లండన్‌లో భారీ జీతాలతో ఉద్యోగాలు, యూకే వీసాలు ఇప్పిస్తామంటూ పలువురు నిరుద్యోగులను నమ్మించి కోట్లాది రూపాయలు వసూలు చేశారన్న ఆరోపణల నేపథ్యంలో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అరెస్ట్

బ్రిటిష్ ఎయిర్‌వేస్ విమానంలో సోమవారం లండన్ నుంచి హైదరాబాద్ చేరుకున్న నందనను.. శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు గుర్తించారు. గతంలోనే ఆమెపై జారీ చేసిన లుక్‌అవుట్ సర్క్యులర్ (LOC) ఆధారంగా అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆమెను ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీసులకు అప్పగించారు.

అసలు కేసు ఏంటి?

నందన, ఆమె భర్త మధుపై విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. సోషల్ మీడియాలో ఉన్న పరిచయాలు, యూట్యూబ్ ఛానెల్‌కు ఉన్న క్రేజ్‌ను ఉపయోగించుకుని యూకేలో ఉద్యోగాలు, స్టూడెంట్ వీసా రెన్యూవల్స్ ఇప్పిస్తామని చెప్పి ఒక్కొక్కరి నుంచి లక్షల రూపాయలు వసూలు చేశారని పలువురు బాధితులు ఆరోపించారు.

డిగ్రీలు పూర్తి చేసి విదేశాల్లో ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న యువతను టార్గెట్ చేశారని.. డబ్బులు చెల్లించిన తర్వాత తమ ఫోన్లకు స్పందించడం మానేశారని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ ఫిర్యాదుల ఆధారంగా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

అజ్ఞాతంలోకి వెళ్లడంతో ఎల్‌వోసీ

కేసు నమోదైన అనంతరం నందన, ఆమె భర్త మధు అజ్ఞాతంలోకి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ఏపీ పోలీసులు వారి కోసం లుక్‌అవుట్ సర్క్యులర్ జారీ చేశారు. ఈ క్రమంలో లండన్ నుంచి స్వదేశానికి వచ్చిన నందనను ఎయిర్‌పోర్టులో ఇమ్మిగ్రేషన్ అధికారులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

‘అవన్నీ పుకార్లే’.. నందన

తమపై వస్తున్న ఆరోపణలపై గతంలో నందన స్పందిస్తూ.. అవన్నీ కేవలం పుకార్లని, తమపై కుట్ర జరుగుతోందని పేర్కొన్నట్లు సమాచారం. అయితే ప్రస్తుతం ఆమె పోలీసుల అదుపులో ఉండటంతో ఈ వ్యవహారంపై విచారణ కీలకంగా మారింది.

నందనను ఇబ్రహీంపట్నం పోలీసులు విచారించనున్నారు. బాధితుల ఫిర్యాదులు, డబ్బుల లావాదేవీలు, యూకే ఉద్యోగాలు-వీసాల వ్యవహారంపై పోలీసులు ఎలాంటి ఆధారాలు సేకరించారు? ఈ కేసులో ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉంది? అన్న అంశాలపై దర్యాప్తులో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.