అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కీ గౌడ్ భార్య డాక్టర్ సూచి యాష్కీ తీవ్రంగా గాయపడ్డారు. కుమార్తె డాక్టర్ గగనను ఎండీ కోర్సులో చేర్పించేందుకు అమెరికా వెళ్లిన మధుయాష్కీ దంపతులు అడ్మిషన్ ప్రక్రియ పూర్తి చేసిన అనంతరం బోస్టన్ నుంచి న్యూయార్క్‌కు బయలుదేరారు. ఈ క్రమంలో వర్షం కారణంగా సూచి యాష్కీ ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి పల్టీలు కొట్టింది.
ఈ ప్రమాదంలో ఆమెకు పక్కటెముకలు విరిగినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రస్తుతం న్యూయార్క్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే వైద్యుల పర్యవేక్షణలో ఆమె కోలుకుంటున్నట్లు సమాచారం.
ఇటీవలే చిన్న కుమార్తె డాక్టర్ గగన యాష్కీ న్యూయార్క్ మెడికల్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేయగా, కాన్వకేషన్ కార్యక్రమానికి హాజరైన మధుయాష్కీ దంపతులు ఆమెను బోస్టన్‌లోని మెడికల్ కాలేజీలో ఎండీ కోర్సులో చేర్పించారు. లగేజీ ఎక్కువగా ఉండటంతో భార్యాభర్తలు వేర్వేరు కార్లలో ప్రయాణించగా, మార్గమధ్యంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
డాక్టర్ సూచి యాష్కీ ప్రముఖ ఎండోక్రైనాలజిస్ట్ కాగా, మధుయాష్కీ దంపతులకు కోమలి, గగన అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మరో రెండు రోజుల్లో భారత్‌కు తిరిగి రావాల్సి ఉండగా ఈ ప్రమాదం జరగడం కుటుంబాన్ని కలచివేసింది. ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.












