అమెరికాలోని ప్రవాస భారతీయులకు అరుదైన గౌరవం దక్కింది. మసాచుసెట్స్ రాష్ట్రంలో ప్రతి ఏటా ఆగస్టు 15వ తేదీని ‘ఇండియా డే’గా అధికారికంగా నిర్వహించనున్నట్లు గవర్నర్ మౌరా హీలీ ప్రకటించారు. రాష్ట్ర ఆర్థిక, సాంస్కృతిక ప్రగతిలో భారతీయ-అమెరికన్ సమాజం పోషిస్తున్న కీలక పాత్రకు గుర్తింపుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేశారు.
1947లో బ్రిటిష్ పాలన నుంచి భారత్ స్వాతంత్య్రం పొందిన విషయాన్ని గవర్నర్ తన ప్రకటనలో ప్రస్తావించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారత్ ఎదిగిన తీరును కొనియాడారు. వైద్యం, టెక్నాలజీ, విద్య, వ్యాపారం తదితర రంగాల్లో ఇండియన్-అమెరికన్లు అందిస్తున్న సేవలను ప్రశంసించారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది ప్రవాస భారతీయులు తమతమ రంగాల్లో కీలకంగా రాణిస్తున్నారని గవర్నర్ పేర్కొన్నారు. అమెరికాలోని భారతీయ సమాజం మసాచుసెట్స్ అభివృద్ధికి అందిస్తున్న సహకారాన్ని ప్రత్యేకంగా గుర్తించారు.
ఇదిలా ఉండగా.. బోస్టన్ మేయర్ మిషెల్ వూ కూడా ఆగస్టు 15ను ‘ఇండియా డే’గా ప్రకటిస్తూ ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు. బోస్టన్‌లో కొత్తగా భారత కాన్సులేట్ కార్యాలయం ఏర్పాటు కావడాన్ని ఆమె స్వాగతించారు. అమెరికాలో భారతీయుల ప్రాధాన్యం, ఇరు దేశాల మధ్య సాంస్కృతిక సంబంధాలకు ఈ నిర్ణయం మరింత బలం చేకూర్చనుంది.













