అమెరికా స్టార్టప్ ప్రపంచంలో భారతీయుల సత్తా మరోసారి వెలుగులోకి వచ్చింది. నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికన్ పాలసీ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం, అమెరికాలోని బిలియన్ డాలర్ల విలువైన యూనికార్న్ కంపెనీలలో 59 శాతం కంపెనీలను వలసదారులు స్థాపించారు లేదా సహ-స్థాపించారు. ఇందులో భారతీయులు అగ్రస్థానంలో నిలిచారు.

మొత్తం 775 యూనికార్న్ కంపెనీల్లో 455 సంస్థలకు వలసదారుల వ్యవస్థాపకుల పాత్ర ఉండగా, భారతీయులు ఒక్కరే 96 కంపెనీలను స్థాపించడంలో కీలక పాత్ర పోషించారు. ఈ కంపెనీల మొత్తం విలువ దాదాపు 5 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. ఉద్యోగాల సృష్టి, సాంకేతిక ఆవిష్కరణలు, ఆర్థికాభివృద్ధిలో వలసదారులు కీలక పాత్ర పోషిస్తున్నారని నివేదిక పేర్కొంది. భారత్ తర్వాత ఇజ్రాయెల్, బ్రిటన్, చైనా దేశాలు ఈ జాబితాలో నిలిచాయి.