వైట్ హౌస్‌లో ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ నిర్వహించిన ‘ప్రెసిడెన్షియల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఛాలెంజ్’ జాతీయ విజేతల అవార్డుల కార్యక్రమంలో భారతీయ మూలాల విద్యార్థులు విశేషంగా రాణించారు. ఈ పోటీలో అమెరికా వ్యాప్తంగా 20 వేలకుపైగా విద్యార్థులు పాల్గొన్నారు.
ఎలిమెంటరీ విభాగంలో ఆర్నా జైస్వాల్, ఈషాని ఖత్రి, రివా మడ్డా, సమ్హిత పిన్నమరెడ్డి రూపొందించిన ‘ఫ్రెండ్‌జోన్ చాట్‌బాట్ బులీయింగ్ ప్రివెన్షన్ యాప్’ జాతీయ విజేతగా నిలిచింది. మధ్య పాఠశాల విభాగంలో విహా అయ్యర్, ఆర్య ప్రతాప్, శ్రీమయి శెట్టి రూపొందించిన ‘స్కిల్‌అప్’ ప్రాజెక్ట్‌కు మొదటి స్థానం లభించింది. హైస్కూల్ విభాగంలో ఖండాకర్ మహిన్ కంప్యూటర్ విజన్ ఆధారిత ప్రాజెక్ట్‌తో జాతీయ విజేతగా నిలిచాడు. ఈ సందర్భంగా మెలానియా ట్రంప్ మాట్లాడుతూ, కృత్రిమ మేధస్సు విద్యార్థులకు కొత్త అవకాశాల ద్వారాలు తెరుస్తుందని, వారి కలలను సాకారం చేసే శక్తి కలిగి ఉందని పేర్కొన్నారు.













