అమెరికాలోని న్యూయార్క్ నగరంలో తెలంగాణకు చెందిన ఓ తెలుగు యువకుడు దారుణ హత్యకు గురైన ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాకు చెందిన కుంచ అన్షుల్ పిజ్జా డెలివరీ బాయ్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే జూన్ 5 అర్థరాత్రి పిజ్జా డెలివరీ కోసం వెళ్లిన సమయంలో గుర్తుతెలియని దుండగులు అతనిపై తుపాకీతో కాల్పులు జరిపారు.
ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన అన్షుల్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషాద వార్త తెలియగానే గుండ్లపోచంపల్లిలోని ఎప్సీలోన్ వెంచర్ ప్రాంతంలో నివసిస్తున్న అతని కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.
అన్షుల్ సోదరి తన్వి కన్నీరుమున్నీరుగా విలపిస్తూ, తన అన్న మృతదేహాన్ని వీలైనంత త్వరగా భారత్‌కు తీసుకురావడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అధికారులు సోమవారం నాటికి మృతదేహం భారత్‌కు చేరే అవకాశం ఉందని చెప్పినప్పటికీ, అన్ని ప్రక్రియలను వేగవంతం చేయాలని ఆమె కోరారు.
ఇదిలా ఉండగా, ఈ ఘటనపై భారతీయ సంఘాలు, తెలుగు ప్రవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమెరికాలోని భారత రాయబార కార్యాలయం బాధిత కుటుంబానికి అవసరమైన సహాయాన్ని అందించాలని కోరుతున్నారు.
అన్షుల్ హత్య వెనుక అసలు కారణాలేమిటన్న దానిపై న్యూయార్క్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇది దోపిడీ ప్రయత్నమా లేదా ఇతర కారణాల వల్ల జరిగిందా అనే కోణాల్లో విచారణ కొనసాగుతోంది. నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా, కుటుంబానికి పలువురు ప్రజాప్రతినిధులు, స్థానికులు సానుభూతి తెలిపారు.












