అమెరికాలో జరగనున్న ఫిఫా టోర్నమెంట్‌కు హాజరుకావాలని భావించిన ఓ టర్కీ వ్యాపారవేత్తకు యూఎస్ టూరిస్ట్ వీసా నిరాకరణ ఎదురైంది. ఇప్పటికే 45 దేశాలు సందర్శించిన అనుభవం, పలు షెంగెన్ వీసాలు, యూకే వీసాలు, బలమైన ఆర్థిక స్థితి, వ్యాపార వివరాలు సమర్పించినప్పటికీ వీసా రాలేదని ఆయన వెల్లడించారు.
ఇస్తాంబుల్‌లోని అమెరికా కాన్సులేట్‌లో ఇంటర్వ్యూకు హాజరైన ఆయన, ఫిఫా మ్యాచ్‌లు చూడటంతో పాటు పర్యటన కోసం అమెరికా వెళ్లాలని తెలిపాడు. ఇంటర్వ్యూలో ఫిఫా, ప్రయాణ అనుభవాలపై అధికారితో స్నేహపూర్వకంగా చర్చ జరిగినప్పటికీ, చివర్లో వీసా మంజూరు కాలేదని తెలియజేశారు.
తన ట్రావెల్ హిస్టరీ, బ్యాంక్ బ్యాలెన్స్, పెట్టుబడులు, కుటుంబ బంధాలు అన్నీ బలంగా ఉన్నప్పటికీ తిరస్కరణ ఎందుకు జరిగిందో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు.
అమెరికా ఫిఫా మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనున్న నేపథ్యంలో, ప్రపంచవ్యాప్తంగా అభిమానులు వీసాల కోసం దరఖాస్తు చేస్తున్నారు. అయితే బలమైన ఆర్థిక, ప్రయాణ రికార్డులు ఉన్నవారికీ వీసా హామీ లేకపోవడం ఫుట్‌బాల్ అభిమానుల్లో ఆందోళన పెంచుతోంది.












