ఆసియా గేమ్స్‌ 2026లో కబడ్డీలో భారత్‌ గోల్డెన్ డబుల్‌ పూర్తి చేసింది. శనివారం జరిగిన పురుషుల కబడ్డీ ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి ఇరాన్‌పై భారత్‌ 40-34 తేడాతో విజయం సాధించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది.

ఈ విజయంతో ఈ ఆసియా గేమ్స్‌లో భారత్‌ ఖాతాలో నాలుగో స్వర్ణ పతకం చేరింది. అంతకుముందు మహిళల క్రికెట్‌, కమల్‌జీత్‌–సురుచి సింగ్‌ జోడీ 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ మిక్స్‌డ్‌ టీమ్‌, మహిళల కబడ్డీలో భారత్‌ స్వర్ణ పతకాలు సాధించింది.

పురుషుల కబడ్డీలో భారత్‌కు ఇది ఆసియా గేమ్స్‌ చరిత్రలో రికార్డు స్థాయిలో తొమ్మిదో గోల్డ్ మెడల్‌. 2018 ఆసియా గేమ్స్‌లో మాత్రమే భారత్‌ స్వర్ణం సాధించలేకపోయింది. ఆ ఏడాది కాంస్య పతకంతో సరిపెట్టుకుంది.

ఫైనల్‌ ఆరంభం నుంచే భారత్‌, ఇరాన్‌ హోరాహోరీగా తలపడ్డాయి. భారత్‌ తరఫున అర్జున్‌ దేశ్వాల్‌, దేవాంక్‌ దలాల్‌ దూకుడైన రైడ్లతో ఆకట్టుకోగా.. ఇరాన్‌ తరఫున అలీ సమాది చౌబ్‌తరాష్‌ భారత్‌కు సవాల్‌ విసిరాడు.

భారత్‌ కెప్టెన్‌ సునీల్‌ కుమార్‌తో పాటు జైదీప్‌, సుమిత్‌, రాహుల్‌ సేత్‌పాల్‌ రక్షణలో కీలక పాత్ర పోషించారు. ఇరు జట్లు డిఫెన్స్‌లో సహనంతో ఆడటంతో మ్యాచ్‌ ఉత్కంఠగా సాగింది. తొలి అర్ధభాగం ముగిసే సమయానికి ఇరాన్‌ 18-17తో స్వల్ప ఆధిక్యంలో నిలిచింది.

రెండో అర్ధభాగంలో అర్జున్‌ దేశ్వాల్‌ కీలక సమయంలో ఫజెల్‌ అత్రాచలిని దాటుకుని చేసిన రైడ్‌ మ్యాచ్‌ గమనాన్ని మార్చింది. ఆ తర్వాత భారత్‌ ఆలౌట్‌ సాధించి.. చివరి 10 నిమిషాలు మిగిలి ఉండగానే ఐదు పాయింట్ల ఆధిక్యంలోకి వెళ్లింది.

చివరి నిమిషాల్లో ఇరాన్‌ పుంజుకునేందుకు ప్రయత్నించినా.. భారత ఆటగాళ్లు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. దీంతో 40-34తో విజయం సాధించిన భారత్‌.. ఈ ఆసియా గేమ్స్‌ కబడ్డీ పోటీలను అజేయంగా ముగించి స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది.