బంగ్లాదేశ్‌ యువ బ్యాటర్‌ తౌహిద్‌ హృదోయ్‌ ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో సంచలనం సృష్టించాడు. దక్షిణాఫ్రికా ‘ఏ’తో జరుగుతున్న అనధికారిక టెస్టులో ఏకంగా 350 పరుగులతో నాటౌట్‌గా నిలిచి రికార్డుల మోత మోగించాడు. 481 బంతులు ఎదుర్కొన్న హృదోయ్‌.. 27 ఫోర్లు, 10 సిక్సర్లతో విధ్వంసకర ఇన్నింగ్స్‌ ఆడాడు.

పొట్చెఫ్‌స్ట్రూమ్‌లో 37/2 స్కోరు వద్ద క్రీజులోకి వచ్చిన హృదోయ్‌.. ఆ తర్వాత ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఈ క్రమంలో బంగ్లాదేశ్‌ తరఫున ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డును తన పేరిట రాసుకున్నాడు. గతంలో తమీమ్‌ ఇక్బాల్‌ 334 నాటౌట్‌తో నెలకొల్పిన రికార్డును అధిగమించాడు.

అంతేకాదు.. ‘ఏ’ జట్ల తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన బ్యాటర్‌గానూ హృదోయ్‌ చరిత్ర సృష్టించాడు. 2013లో ఇండియా ‘ఏ’ తరఫున చటేశ్వర్‌ పుజారా చేసిన 306 పరుగుల రికార్డును 350 పరుగులతో బద్దలు కొట్టాడు. స్వదేశానికి దూరంగా అనధికారిక మ్యాచ్‌లో ‘ఏ’ జట్టు తరఫున ట్రిపుల్‌ సెంచరీ చేసిన తొలి బ్యాటర్‌గానూ నిలిచాడు.

దక్షిణాఫ్రికా గడ్డపై ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లో విదేశీ బ్యాటర్‌ సాధించిన అత్యధిక స్కోరు రికార్డును కూడా హృదోయ్‌ తన ఖాతాలో వేసుకున్నాడు. 1948లో డెనిస్‌ కాంప్టన్‌ చేసిన 300 పరుగుల రికార్డును 78 ఏళ్ల తర్వాత అధిగమించాడు.

హృదోయ్‌ వీరోచిత ఇన్నింగ్స్‌తో బంగ్లాదేశ్‌ ‘ఏ’ జట్టు 676/8 వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. జాకర్‌ అలీ 94, మహ్మద్‌ సైఫుద్దీన్‌ 87 పరుగులతో రాణించారు. అంతకుముందు దక్షిణాఫ్రికా ‘ఏ’ జట్టు 512 పరుగులు చేసింది.

నవంబర్‌లో దక్షిణాఫ్రికాతో బంగ్లాదేశ్‌ రెండు టెస్టుల సిరీస్‌ ఆడనుంది. దీంతో ఈ అనధికారిక టెస్టు ఆ సిరీస్‌కు కీలక సన్నాహకంగా మారింది.