ఐపీఎల్ 2026లో ప్లేఆఫ్స్ రేసు ఆసక్తికరంగా మారుతున్న వేళ గుజరాత్ టైటాన్స్ ఘన విజయం సాధించింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పై 82 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది.
169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్‌కు తొలి ఓవర్‌లోనే భారీ షాక్ తగిలింది. సిరాజ్... ట్రావిస్ హెడ్‌ను గోల్డెన్ డకౌట్ చేసి మెయిడిన్ ఓవర్ వేయడంతో సన్‌రైజర్స్ ఒత్తిడిలో పడింది. అనంతరం కగిసో రబడ చెలరేగి అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, స్మరన్ రవిచంద్రన్ వికెట్లు తీసి హైదరాబాద్‌ను కేవలం 32 పరుగులకే 4 వికెట్ల నష్టానికి పరిమితం చేశాడు.
మిడిలార్డర్ కూడా చేతులెత్తేయడంతో హైదరాబాద్ కోలుకోలేకపోయింది. జాసన్ ఒమర్ హోల్డర్...హెన్రిచ్ క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి, శివాంగ్ కుమార్ వికెట్లు తీసి మ్యాచ్‌ను పూర్తిగా గుజరాత్ వైపు తిప్పాడు. చివర్లో కెప్టెన్ పాట్ కమ్మిన్స్ 19 పరుగులతో పోరాడినా ప్రయోజనం లేకపోయింది. చివరకు హైదరాబాద్ జట్టు 86 పరుగులకే ఆలౌట్ అయింది.
గుజరాత్ బౌలర్లలో రబాడా, హోల్డర్ తలో 3 వికెట్లు పడగొట్టగా.. ప్రసిద్ధ్ కృష్ణ 2 వికెట్లు తీశాడు. సిరాజ్, రషీద్ ఖాన్ చెరో వికెట్ సాధించారు. ఈ భారీ విజయంతో గుజరాత్ టైటాన్స్ నెట్ రన్‌రేట్‌ను కూడా గణనీయంగా పెంచుకుంది.















