ప్రధానమంత్రి మోడీ నాయకత్వంలోని కేంద్ర మంత్రివర్గం బుధవారంనాడు కీలక నిర్ణయాలు తీసుకుంది. పారిశ్రామిక, మౌలిక సదుపాయాల రంగాలను మరింత బలోపేతం చేయాలని కేంద్రం కంకణం కట్టుకుంది. మొత్తం రూ.2.19లక్షల కోట్ల విలువైన ఏడు భారీ ప్రాజెక్టులకు మంత్రివర్గంలో ఆమోదం లభించింది. మొబైల్ ఫోన్ల తయారీ రంగానికి మరింత ఊతమివ్వడం, దేశాన్ని సెమీకండక్టర్ల తయారీలో గ్లోబల్ హబ్‌గా మార్చడం, ఎరువుల రంగంలో స్వయంసమృద్ధి సాధించడంతో పాటు వారణాసిలో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఈ సమావేశంలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. క్యాబినెట్ భేటీ అనంతరం కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు.

భారతదేశాన్ని అంతర్జాతీయ చిప్ తయారీ కేంద్రంగా మార్చే లక్ష్యంతో ప్రభుత్వం ’సెమీకండక్టర్ మిషన్ 2.0’ ను ప్రకటించింది. దీని కోసం భారీగా రూ.1,27,500 కోట్లు కేటాయించింది. ఈ నిర్ణయం ద్వారా దేశంలో అత్యాధునిక సెమీకండక్టర్ ప్లాంట్ల ఏర్పాటు, డిజైనింగ్, ప్యాకేజింగ్ పరిశ్రమలకు భారీగా ప్రోత్సాహం లభించనుంది. దేశీయంగా మొబైళ్ల తయారీకి ప్రోత్సాహం ఇవ్వాలని కేంద్రం నిర్ణయించినట్లు అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. రూ.62,500 కోట్ల కేటాయింపుతో ‘మొబైల్ ఫోన్ మాన్యు ఫ్యాక్చరింగ్ స్కీమ్’ (ఎంపిఎంఎస్)కు క్యాబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. దీన్ని పిఎల్‌ఐ 2.0గా తెలిపారు. ఈ పథకం ద్వారా దేశ యువతకు భారీగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆయన చెప్పారు.


యూరియాపై జాతీయ పెట్టుబడి విధానం..

ఎరువుల రంగంలో భారతదేశాన్ని స్వయం సమృద్ధి దిశగా మార్చేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి అనారు. విదేశీ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు అందులో భాగంగా అత్యధిక డిమాండ్ ఉండే యూరియా కోసం ఒక జాతీయ పెట్టుబడుల విధానాన్ని తీసుకువస్తున్నట్లు తెలిపారు. తద్వారా దేశీయంగా యూరియా ఉత్పత్తిని 10 మిలియన్ టన్నులకు పెంచి రైతులకు కొరత లేకుండా చేయనున్నారు. దేశవ్యాప్తంగా 8 నుంచి 9 గ్యాస్ ఆధారిత యూరియా ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.

వారణాసి ప్రాజెక్టులకు - రూ.25,446 కోట్లు

ప్రధాని మోడీ నియోజకవర్గం, ప్రముఖ పుణ్యక్షేత్రం వారణాసికి భారీ ఎత్తున మౌలిక వసతుల కల్పన ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. రెండు భారీ ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి కేంద్రం కెబినెట్ అనుమతి ఇచ్చింది. వరుణా నది ఎలివేటెడ్ కారిడార్‌కు రూ.10,998 కోట్లు కేటాయించారు. వరుణా నది వెంబడి 6/4 లేన్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మించనున్నట్లు మంత్రి అశ్వినీ తెలిపారు. ఇక రూ.14,448 కోట్ల వ్యయంతో గంగా నది వెంబడి 6 లేన్ల అత్యాధునిక ఎలివేటెడ్ కారిడార్‌ను చేపట్టనున్నారు. ఇక దేశంలో సరుకు రవాణా, ప్రయాణికుల రాకపోకలను మరింత సులభతరం చేసేందుకు రెండు కీలక రైల్వే లైన్ల ప్రాజెక్టులకు మంత్రివర్గం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. పారాదీప్-హరిదాస్‌పూర్ రైల్వే లైన్ నిర్మాణానికి రూ.2,542 కోట్ల అంచనా వ్యయంతో డబ్లింగ్ పనులు చేపట్టనున్నారు.