
21 ఏళ్లకే చట్టసభలకు సంబంధించిన తీర్మానాన్ని ఆమోదించే అవకాశం
17నుంచి సెప్టెంబర్ మొదటి వారం వరకు సిఎం విదేశీ పర్యటన
పెట్టుబడుల ఆకర్షణే లక్షంగా యూకే, అమెరికా, జర్మనీ, చైనాలో పర్యటన
క్రీడలు, శిక్షణా సంస్థల భాగస్వామ్యంపై విదేశీ ప్రతినిధులతోనూ చర్చలు
మన తెలంగాణ/హైదరాబాద్: ఈ నెల 16వ తే దీన ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిసింది. 17వ తేదీ నుంచి ముఖ్యమంత్రి విదేశీ పర్యటనకు వెళ్తున్నందున అంతకు ముం దు రోజే అసెంబ్లీ నిర్వహించి 21ఏళ్లకే చట్టసభల కు పోటీచేసే అవకాశంపై తీర్మానం చేసే అవకా శం ఉన్నట్టుగా తెలిసింది. కాగా, రాష్ట్రంలో ప్రపంచస్థాయి విద్యా ప్రమాణాలను తీసుకురావడం, యువతలో అంతర్జాతీయ స్థాయి నైపుణ్యాలను పెంపొందించడం, క్రీడారంగాన్ని మరింత బలోపేతం చేయడం లక్ష్యంగా నాలుగు దేశాల్లో సిఎం రేవంత్‌రెడ్డి పర్యటించనున్నారు.
ఈ నెల 17వ తేదీ నుంచి సెప్టెంబర్ మొదటివారం వరకు ముఖ్యమంత్రి పర్యటన కొనసాగనున్నట్టుగా తెలిసింది. విదేశీ పర్యటనలో భాగంగా యూకే, అమెరికా, జర్మనీ, చైనా దేశాలకు చెందిన పలువురు పారిశ్రామిక వేత్తలతో సిఎం సమావేశం కానున్నట్టుగా సమాచారం. సిఎం రేవంత్‌రెడ్డి బృందం ముందుగా యునైటెడ్ కింగ్డమ్ (యూకే)కు, అక్కడి నుంచి అమెరికాకు వెళ్లనున్నట్లుగా తెలుస్తోంది.
ఫ్యూచర్‌సిటీలో పెట్టుబడులతో పాటు విదేశీ యూనివర్సిటీలు, క్రీడలు, శిక్షణ సంస్థల భాగస్వామ్యంపై చర్చించనున్నట్టుగా తెలిసింది. దీంతోపాటు యూకే, అమెరికాలోని ప్రముఖ విశ్వవిద్యాలయాలు, నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను ముఖ్యమంత్రి సందర్శించడంతో పాటు తెలంగాణలో ఉన్నత విద్యను అంతర్జాతీయ ప్రమాణాలకు తీసుకెళ్లే దిశగా విద్యాసంస్థల ప్రతినిధులతో సమావేశమై పరస్పర అవగాహన ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది. ఉన్నత స్థాయి ప్రతినిధి బృందంలో ముఖ్యమంత్రి సలహాదారు కె.రామకృష్ణా రావుతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొనే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది.








