
ఉత్సవాల నిర్వహణ కోసం హిందువులు బిక్షమెత్తుకోవాలా? అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆగ్రహంగా ప్రశ్నించారు. రంజాన్‌కు రూ. 33 కోట్లు కేటాయించి, బోనాలకు రూ. 20 కోట్లే కేటాయించిందని ఆయన ధ్వజమెత్తారు. ఆదివారం సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని ఆమ్మవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వాన్ని తూర్పారపట్టారు. జంట నగరాల్లోనే 3 వేల పైచిలుకు దేవాలయాలు ఉంటే రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన మూడు వేల కోట్ల రూపాయలు ఏ మూలకు సరిపోతాయని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వానికి హిందువుల పండుగలంటే ఎందుకంత చులకన అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ అంటేనే ముస్లిం, ముస్లిం అంటేనే కాంగ్రెస్ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలే ఇందుకు నిదర్శనం అన్నారు.
గతంలో బిఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు బోనాల ఉత్సవాలకు నిధుల కేటాయింపులో నిర్లక్ష్యం వహించిందని ఆయన తూర్పారపట్టారు. జనాభా ప్రాతిపదికన పండుగలు, ఉత్సవాలకు నిధులను కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. హిందూ సమాజం జాగృతం కావాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. రాష్ట్రంలో హిందు పండుగలు, ఉత్సవాల నిర్వహణ కోసం హిందువులంతా బిచ్చమెత్తుకునే దుస్థితి నెలకొందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అత్యంత ఘనంగా నిర్వహించుకునే బోనాల ఉత్సవాల నిర్వహణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. “బోనాల ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించి వదిలేసిందని, రంజాన్ పండుగ నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.33 కోట్లు ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు.
బండికి ఘన స్వాగతం..
ఇదిలాఉండగా కేంద్ర మంత్రి బండి సంజయ్ ఉజ్జయిని ఆలయం వద్దకు చేరుకోగానే బిజెపి నాయకులు, కార్యకర్తలు, భక్తులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. దారి పొడవునా భక్తులు ఎండలో క్యూలో నిలబడడం, వారికి తాగు నీళ్లు సహా కనీస సౌకర్యాలు లేని విషయాన్ని ఆయన గమనించారు. కొంత మంది భక్తులు తమకు కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్న అంశాన్ని చెప్పారు. బోనాల జాతర సందర్భంగా హిందూవులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. మహంకాళి బోనాలకు ఒక చరిత్ర ఉందని, 1813 ప్రాంతంలో హైదరాబాద్-సికింద్రాబాద్‌లో కలరా,
మశూచి వంటి అంటు వ్యాధులు విజృంభించాయని, జనం పిట్టల్లా రాలిపోతుంటే, ఏం చేయాలో తెలియక జనం అల్లాడిపోయారన్నారు. అప్పట్లో ఉజ్జయినిలో విధులు నిర్వహిస్తున్న సైనికులు మహంకాళి అమ్మవారిని ప్రార్థిస్తూ “అమ్మా...ఈ వ్యాధి నుంచి తమ ఊరి జనమంతా బయటపడితే తిరిగొచ్చి మేమంతా కలిసి నీకు బోనం సమర్పిస్తాం‘ అని వేడుకంటే అమ్మవారు కరుణించడంతో వ్యాధి తగ్గిందని, ఫలితంగా ఆనాటి నుండి అంగరంగ వైభవంగా బోనాల ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు కేంద్ర మంత్రి బండి సంజయ్ వివరించారు.











