న్యూఢిల్లీ: నీట్ పేపర్ లీక్‌కు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కోరుతూ నిరాహార దీక్ష చేస్తున్న పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ కేంద్రానికి లేఖ రాశారు. బుధవారం ఆస్పత్రి నుంచి సోనమ్ పలు డిమాండ్లను లేఖ ద్వారా తెలియజేశారు. తన డిమాండ్లపై హమీ ఇస్తే..నిరసన దీక్షను విరమిస్తానని ఆయన స్పష్టం చేశారు. మంగళవారం గురుగ్రామ్‌లోని మెదాంత ఆసుపత్రిలో కేంద్ర మంత్రి జేపీ నడ్డా, జితేంద్ర సింగ్‌లు వాంగ్‌చుక్‌ను కలిశారు. ఆయనను దీక్ష విరమించాలని కోరినట్లు తెలుస్తోంది. ఈక్రమంలోనే సోనమ్ కేంద్రానికి లేఖ రాశారు.

ఆసుపత్రిలో తనను పరామర్శించి, దీక్ష విరమించాలని కోరినందుకు వాంగ్‌చుక్ మంత్రులకు ధన్యవాదాలు తెలిపారు. విద్యార్థుల సంక్షేమం, జవాబుదారీతనంపై ప్రభుత్వం స్పష్టమైన హామీలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఆందోళన చేస్తోన్న విద్యార్థులపై ఎలాంటి చర్యలు తీసుకోకూడదని.. కేసులు పెట్టి వేధించొద్దని.. అలాగే, నీట్‌ బాధిత కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వాలని ఆయన లేఖలో డిమాండ్ చేశారు. తన డిమాండ్లపై కేంద్రం స్పష్టమైన హామి ఇస్తే.. వెంటనే దీక్ష విరమిస్తానని సోనమ్ వెల్లడించారు.