
పశ్చిమ బెంగాల్: ఈ ఎన్నికల్లో టిఎంసి గెలవబోతుందని పశ్చిమ బెంగాల్ సిఎం మమతా బెనర్జీ దీమా వ్యక్తం చేశారు. ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి టిఎంసినే విజేతగా నిలుస్తుందని అన్నారు. ఎన్నికల ఫలితాల సరళిపై మమతా బెనర్జీ స్పందించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. చాలా చోట్ల 14 నుంచి 18 రౌండ్ల వరకు లెక్కింపు కొనసాగుతుందని, ఓట్ల లెక్కింపు కేంద్రాల నుంచి టిఎంసి నేతలు వెళ్లొద్దని సూచించారు. ఇప్పటి వరకు 2నుంచి 4 రౌండ్ల లెక్కింపే జరిగిందని, ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి టిఎంసినే విజేతగా నిలుస్తుందని తెలియజేశారు. కార్యకర్తలెవరూ భయపడాల్సిన పనిలేదని, పథకం ప్రకారమే బిజెపి ఆధిక్యంలో ఉన్నట్లు చూపుతున్నారని విమర్శించారు. చాలా కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ఆపేశారని, టిఎంసి నేతలను కేంద్ర బలగాలు వేధిస్తున్నాయని మండిపడ్డారు. సర్ ఆధారంగా ఓట్లు దొంగిలించే ప్రయత్నం జరిగిందని, టిఎంసి వందకు పైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నా ప్రకటించట్లేదని ధ్వజమెత్తారు. అన్నీ తప్పుడు లెక్కలు చెబుతున్నారని, ఓట్ల లెక్కింపుతో ఇసి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర బలగాలు.. ఇసితో కలిసి పనిచేస్తున్నాయని మమతా బెనర్జీ దుయ్యబట్టారు.
పశ్చిమ బెంగాల్: టిఎంసి (97) బిజెపి( 190), కాంగ్రెస్ (1), వామపక్షాలు (3), ఇతరులు (2) ఆధిక్యంలో ఉన్నారు.















