
న్యూఢిల్లీ: రామజన్మభూమి ఆలయంలో చందాల ఉదంతంలో తక్షణ విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించింది. వెంటనే కేసు చేపట్టకపోతే మిన్ను విరిగి మీద పడుతుందా? అని పిటిషనర్‌ను ధర్మాసనం మందలించింది. భక్తుల విశ్వాసాల సంబంధిత అయోధ్య చందాల మాయంవిషయంలో తక్షణ విచారణ జరగాలి.
నిష్పక్షపాత, సకాల నిర్ణీత దర్యాప్తులో నిజాలు తేలాలని న్యాయవాదులు అజయ్ కుమార్ రాయ్, దినేష్ కుమార్ యాదవ్‌లు పిటిషన్ దాఖలు చేశారు. కేసును తక్షణం సిబిఐ సారధ్య బహుముఖ సిట్ పరిధికి మార్చాలని, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో న్యాయం అసాధ్యమని పిటిషనర్లు తెలిపారు. అంతా బాగానే ఉంది కానీ వెనువెంటనే ఈ కేసు విచారణను మిగిలినవి తప్పించి ముందుకు తీసుకురావడం కుదరదని న్యాయమూర్తులు ఎంఎం సుంద్రేష్, షీల్‌నాగ్‌తో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. వేసవి సెలవుల తరువాత లిస్టులోకి చేరుస్తామని తెలిపారు.
నిందితుల తరఫున వాదిస్తే 5 లక్షల జుర్మానా
అయోధ్య రాముడి సొమ్ము స్వాహా ఉదంతంలో నిందితుల తరఫున వాదించరాదని ఫైజాబాద్ లాయర్ల సంఘం సోమవారం నిర్ణయం తీసుకుంది. అయోధ్యకు మచ్చ తెచ్చే పాపం చేసిన వారి తరఫున కోర్టుకువెళ్లే లాయర్లకు తమ సంస్థ నుంచి రూ 5లక్షల జరిమానా విధిస్తామని లాయర్ల సంఘం సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. తమ అందరి మనోభావాలను కొందరు దుండగులు గాయపర్చారు. వీరికి కఠిన శిక్షలు పడాల్సిందే అని బార్ కార్యదర్శి శైలేంద్ర జైస్వాల్ ప్రకటించారు.












