
ఒకప్పుడు పిల్లల భవిష్యత్తును నిర్మించిన విద్య.. నేడు కుటుంబాల ఆర్థిక భవిష్యత్తునే పరీక్షించే వ్యవస్థగా మారుతోంది. ప్రతి కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం తల్లిదండ్రులకు ఆనందం కంటే ఆందోళననే ఎక్కువగా మిగులుస్తోంది. దానిని నియంత్రణ లేని మార్కెట్ శక్తులకు వదిలేస్తే సమాజంలో ఆర్థిక అసమానతలు మరింత పెరుగుతాయని ఐక్యరాజ్యసమితి విద్యా నిపుణులు చాలాకాలంగా హెచ్చరిస్తున్నారు. యునెస్కో విడుదల చేసిన గ్లోబల్ ఎడ్యుకేషన్ మానిటరింగ్ నివేదికల ప్రకారం దక్షిణాసియా దేశాల్లో విద్య కోసం కుటుంబాలు స్వయంగా భరించాల్సిన వ్యయం గణనీయంగా పెరిగింది. ప్రపంచ బ్యాంకు విద్యా ఆర్థిక విశ్లేషణలు కూడా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో విద్యారంగం క్రమంగా వాణిజ్యీకరణ వైపు సాగుతోందని సూచి స్తున్నాయి. ఈ ధోరణి తెలుగు రాష్ట్రాల్లోనూ కనిపిస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమైన ప్రతిసారీ ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల ఫీజుల పెంపు మధ్యతరగతి కుటుంబాలకు పెద్ద ఆర్థిక సవాలుగా మారుతోంది. ఒకప్పుడు సేవా రంగంగా భావించిన విద్య, ఇప్పుడు భారీ పెట్టుబడులు తిరిగే రంగంగా మారిందనే చర్చ కొనసాగుతోంది. విద్యాశాఖ పర్యవేక్షణ, ప్రభుత్వ నియంత్రణ, యాజమాన్యాల స్వేచ్ఛ మధ్య సమతుల్యత లోపిస్తోందా అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి.
ప్రైవేటు పాఠశాలల ఫీజుల నియంత్రణ కోసం గత దశాబ్దానికి పైగా వివిధ కమిటీలు ఏర్పాటు చేయబడినా, సమగ్ర చట్టపరమైన వ్యవస్థ ఇంకా అమలులోకి రాలేదనే అభిప్రాయాలు ఉన్నాయి. 2017లో ఏర్పాటైన ప్రొఫెసర్ తిరుపతిరావు కమిటీ 2020లో సమర్పించిన నివేదికలో ఫీజుల పెంపుపై పరిమితులు విధించా లని సూచించింది. అనంతరం ఏర్పాటైన కమిటీలు కూడా నియంత్రణ వ్యవస్థ అవసరాన్ని ప్రస్తావించినప్ప టికీ, వాటి సిఫారసులు పూర్తి స్థాయిలో అమలుకు నోచుకోలేదని పరిశీలకులు పేర్కొంటున్నారు. నేషనల్ శాంపిల్ సర్వే 80వ రౌండ్-2025 ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో ప్రైవేటు విద్యపై కుటుంబాల సగటు వార్షిక వ్యయం రూ.35,104 కాగా, పట్టణ ప్రాంతాల్లో అది రూ.41,475కు చేరింది. హైదరాబాద్లోని కొన్ని ప్రాంతాల్లో ఎల్కేజీ, యూకేజీ ప్రవేశాలకే రూ.2 లక్షల వరకు ఫీజులు వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఇక ఆదిలాబా ద్, వరంగల్, ఖమ్మం, కరీంనగర్ వంటి నగరాల్లోని కొన్ని ప్రైవేటు పాఠశాలల్లో రూ.65 వేల నుంచి రూ.1 లక్ష వరకు ఫీజులు అమలులో ఉన్నట్లు తెలుస్తోంది. ఫిన్లాండ్, సింగపూర్, బ్రిటన్ వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రాథమిక విద్యను అత్యున్నత ప్రమాణాలతో, అందరికీ సమానంగా ఉచితంగా లేదా ప్రభుత్వ పూర్తి నియంత్రణలో అందించడం ఒక ప్రాథమిక సూత్రంగా కొనసాగుతోంది. అంతర్జాతీయ విద్యా ప్రమాణాల ప్రకారం తరగతి గది పరిమాణం, ఉపాధ్యాయ, విద్యార్థి నిష్పత్తి, మానసిక వికాసానికి అవసరమైన క్రీడా వసతులు, అలాగే ప్రైవేట్ సంస్థల లాభాల శాతంపై కఠిన నియంత్రణ ఉంటుంది. కానీ మన దేశంలో, ముఖ్యంగా ప్రాంతీయ విద్యా రంగంలో ’ఇంటర్నేషనల్ స్కూల్’ అనే బోర్డు చాలా సందర్భాల్లో ప్రచార సాధనంగా మాత్రమే మారుతోందనే విమర్శలు ఉన్నాయి. అంతర్జా తీయ విద్యా హక్కుల ఒప్పందాల ప్రకారం విద్యార్థిపై ఎలాంటి మానసిక లేదా ఆర్థిక వివక్ష చూపకూడదు. అయినప్పటికీ, క్షేత్రస్థాయిలో నాణ్యమైన విద్య పేరిట సామాన్య కుటుంబాలను విద్యకు దూరం చేస్తూ, విద్యను కార్పొరేట్ వ్యాపారంగా మార్చుతున్న ధోరణిపై అంతర్జాతీయ విద్యా వేదికలు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రైవేటు ప్లే స్కూళ్లు, ప్రీ-ప్రైమరీ, సీబీఎస్‌ఈ, ఇంటర్నేషనల్ పాఠశాలల్లో నిబంధనల అమలుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కొన్ని విద్యాసంస్థల్లో అనుమతుల పరిధికి మించి తరగతులు నిర్వహిస్తున్నాయనే ఆరోపణలు, ఫిర్యాదులు అప్పుడప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన జీవోలు, నిబంధనలు అన్ని చోట్ల ఒకే విధంగా అమలవడం లేదని పరిశీలనలు సూచిస్తున్నాయి. విదేశీ పెట్టుబడులు పెరగడంతో విద్యారంగంలో పోటీతో పాటు వాణిజ్య ధోరణి కూడా పెరిగిందనే విశ్లేషణలు ఉన్నాయి. జిల్లా స్థాయిలో పర్యవేక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. టెక్నో, ఈ-టెక్నో, ఒలింపి యాడ్, ఐఐటీ కాన్సెప్ట్ వంటి పేర్లతో ప్రచా రం చేస్తున్న కొన్ని పాఠశాలల్లో కనీస మౌలిక వసతులపైనా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. జీవో నెం.88లో పేర్కొన్న ఆటస్థల నిబంధనలు, విద్యా హక్కు చట్టం లోని 25 శాతం ఉచిత సీట్ల నిబంధన, ఫీజుల వివరాల ప్రదర్శన వంటి అంశా లు అన్ని చోట్ల సమర్థవంతంగా అమలవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఈ అంశాలపై తల్లిదండ్రుల సంఘాలు, విద్యార్థి సంఘాలు తరచూ ఆందోళనలు వ్యక్తం చేస్తున్నాయి. జీవోలు ఫైళ్లకే పరిమితం కాకుండా పాఠశాలల గుమ్మం వరకు చేరినప్పుడే విద్యా వ్యవస్థలో నిజమైన మార్పు కనిపిస్తుంది.
ఫిరోజ్ ఖాన్
96404 66464












