మన తెలంగాణ/హైదరాబాద్‌ః ఆరోగ్య రంగానికి ప్రధాని నరేంద్ర మోడీ పెద్ద పీట వేశారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు అన్నారు. వైద్యులు సమాజానికి అందిస్తున్న సేవలు అమూల్యమైనవని, రోగికి చేసే వైద్యం ఒక వ్యక్తికే కాకుండా సమాజానికి, దేశానికి చేసే సేవగా భావించాలని ఆయన తెలిపారు. బిజెపి డాక్టర్స్ సెల్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, జాతీయ భావంతోనే దేశాభివృద్ధి సాధ్యం అని ఆయన తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయలను కేటాయిస్తోందని ఆయన చెప్పారు.

జిల్లా ఆసుపత్రులు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, బస్తీ దవాఖానాలలో అవసరమైన మందులు, పరికరాలు, సిబ్బంది జీతాల వరకు మెజారిటీ నిధులను కేంద్రమే అందిస్తోందని ఆయన తెలిపారు. కోవిడ్ సమయంలో భారత్ బయోటెక్ స్వదేశీ వ్యాక్సిన్ రూపొందించడానికి ప్రధాని మోడీ అందించిన ప్రోత్సాహమే కారణమని కొనియాడారు. స్వచ్ఛ భారత్ పరిసరాల పరిశుభ్రతకే కాక ’స్వస్థ్ భారత్’ సాధనకు పునాదిగా నిలిచిందని తెలిపారు. ఖేలో ఇండియా, అంతర్జాతీయ యోగా దినోత్సవం ద్వారా ప్రతి ఒక్కరిలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిందన్నారు. సోషల్ మీడియా (వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్)లో వచ్చే అనధికారిక వైద్య సలహాలు, చిట్కాలను నమ్మి ఆరోగ్యం పాడు చేసుకోవద్దని, తప్పని సరిగా అర్హులైన డాక్టర్ల సలహాలు మాత్రమే పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

కార్గిల్ యోధుల త్యాగాలు స్మరణీయం:

కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా దేశ సరిహద్దులను కాపాడేందుకు ప్రాణ త్యాగం చేసిన అమర వీరులకు ఆయన ఘన నివాళులర్పించారు. అంతకు ముందు ఆయన పరేడ్ గ్రౌండ్ ఆవరణలోని స్థూపం వద్ద కార్గిల్ యోధులకు నివాళి అర్పించారు. యువతలో జాతీయ భావం పెంపొందాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. రాష్ట్రీయతతోనే దేశ ప్రగతి సాధ్యమవుతుందని ఆయన తెలిపారు. ఇజ్రాయెల్ వంటి చిన్న దేశాలు శత్రువుల మధ్య ఉన్నప్పటికీ, జాతీయ భావం, పక్కా పరిశోధనలు, సైనిక శిక్షణ, అధునాతన వైద్య విధానాల వల్ల ప్రపంచంలోనే శక్తివంతంగా ఎదిగాయని గుర్తు చేశారు. సోషలిజం, కమ్యూనిజం, క్యాపిటలిజం కంటే ’నేషనలిజం’ (రాష్ట్రీయత) ద్వారానే దేశం వేగంగా అభివృద్ధి చెందుతుందని రాంచందర్ రావు తెలిపారు. సమాజ ఆరోగ్య రక్షణలో భాగస్వాములవుతున్న వైద్యులందరికీ రాoచందర్ రావు ఈ సందర్భంగా ప్రత్యేక అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.