
నేచురల్ స్టార్ నాని సమర్పణలో తెరకెక్కిన ’కోర్ట్ - స్టేట్ వర్సెస్ ఎ నోబడీ’ ఘన విజయానంతరం ఆయన యూనానిమస్ ప్రొడక్షన్స్ రెండో చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. నితిన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి ’దండోరా’ ఫేమ్ మురళీకాంత్ దేవసోత్ దర్శకత్వం వహిస్తున్నారు. దీప్తి గంటా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘అలియాస్ రుక్మిణి’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేస్తూ విడుదల చేసిన అనౌన్స్‌మెంట్ వీడియో సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది. ఈ చిత్రాన్ని తాజాగా సాంప్రదాయ పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు.
ముహూర్తపు సన్నివేశానికి నాని క్లాప్ కొట్టగా, నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. నాని తండ్రి గంటా రాంబాబు, నిర్మాత వెంకట్ బోయనపల్లి స్క్రిప్ట్‌ను చిత్ర బృందానికి అందజేశారు. ’కోర్ట్’ దర్శకుడు రామ్ జగదీష్, శైలేష్ కొలను కలిసి తొలి షాట్‌కు దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ “జయం, ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే వంటి సినిమాల్లో నితిన్‌ను ప్రేక్షకులు ఎంతగా ప్రేమించారో మనందరికీ తెలుసు. ఇప్పుడు ’అలియాస్ రుక్మిణి’తో మరోసారి ఆయనను ప్రేమించేలా చేసే సినిమా చేస్తున్నామనే నమ్మకం ఉంది. ఇది చాలా అందమైన ప్రేమకథ”అని అన్నారు. ఈ వేడుకలో హీరో నితిన్, దర్శకుడు మురళీకాంత్ దేవసోత్, నిర్మాత దీప్తి గంటా, సంగీత దర్శకుడు విజయ్ బుల్గానిన్ పాల్గొని మాట్లాడారు.








