వాషింగ్టన్ : ఒమన్ తీరంలో భారతీయులు ఉన్న నౌకలపై అమెరికా దాడి చేయడంపై భారత విదేశాంగ మంత్రి జైశంకర్ అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోకు నిరసన తెలియజేశారు. శుక్రవారం సాయంత్రం రూబియోతో మాట్లాడినట్టు జైశంకర్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. గల్ఫ్‌లో అమెరికా జరిపిన దాడుల్లో ముగ్గురు భారత నావికులు మరణించడంపై నిరసన తెలియజేస్తూ వాణిజ్య నౌకలపై ఇలాంటి దాడులు సమంజసం కాదని వ్యాఖ్యానించారు. ఇక ఈ విషయంపై ఢిల్లీలో అమెరికా దౌత్యాధికారి జేసన్ మీక్స్‌కు విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ రెండుసార్లు సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే భారతీయులున్న నౌకలపై దాడులు చేసింది ఇరానే అని , ఇది పూర్తిగా అంగీకరించలేనిదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆరోపించారు. ఈ ఆరోపణలను టెహ్రాన్ ఖండించింది. ప్రజల దృష్టిని మళ్లించేందుకు అమెరికా తమపై నిందలు మోపుతోందని వ్యాఖ్యానించింది.