సికింద్రాబాద్‌లో లష్కర్ బోనాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆదివారం సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమ్మవారిని దర్శించుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సిఎం జగన్మాతకు బోనం, పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. లష్కర్ బోనాల జాతరలో భాగంగా ఆలయానికి వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన గర్భగుడిలో మహంకాళి అమ్మవారిని దర్శించుకుని, మొక్కులు చెల్లించుకున్నారు.

తెలంగాణ ప్రజలు సుఖసంతోషాలతో, పాడిపంటలతో వర్ధిల్లాలని అమ్మవారిని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, సీతక్క, ఎంఎల్‌ఎ దానం నాగేందర్, బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. వారు కూడా అమ్మవారికి పూజలు చేసి, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వీరితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు కూడా ఈ వేడుకల్లో పాలుపంచుకున్నారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఆలయ పరిసరాల్లో పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.