
అప్రాప్రియేషన్ (నెంబర్.3) బిల్లు, 2026కు రాజ్యసభ గురువారంనాడు ఆమోదం తెలిపింది. 2023 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో గతంలో కేటాయించిన నిధుల కంటే అదనంగా జరిగిన వ్యయాలకు గాను భారత కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి నిధులను అనుమతించేందుకు ఈ బిల్లును తీసుకువచ్చారు. ఈ బిల్లుకు మూజువాణి ఓటుతో పెద్దల సభ ఆమోదం తెలిపింది.బిల్లుపై జరిగిన చర్చకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి సమాధానమిస్తూ అదనపు నిధుల అవసరాన్ని తెలియజేశారు. రెండు ఖాతాల్లోనే అదనపు వ్యయం చోటుచేసుకుందన్నారు. 2023 ఆర్థిక సంవత్సరంలో రెండు ఖాతాల్లో జరిగిన వ్యయాలకు సంబంధించిన అదనపు గ్రాంట్ డిమాండ్ ఇదని తెలిపారు.
\పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఈ ఏడాది ఏప్రిల్‌లో లోక్‌సభకు సమర్పించిన 39వ నివేదికలో కూడా దీనిని పేర్కొందని అన్నారు. కోర్టు ఉత్తర్వుల ప్రకారం రైల్వే మంత్రిత్వ శాఖ చెల్లించాల్సిన రూ.196.44 కోట్ల అదనపు వ్యయం మొదటి డిమాండ్‌గా ఉందన్నారు. రెండవది అతిపెద్ద మొత్తమైన రూ.53,871 కోట్లు రుణాల చెల్లింపులకు సంబంధించినదని వివరించారు. అయితే ఈ రుణ రసీదులు సెక్యూరిటీ జారీకి ప్రతిగా ఉన్నందున దీనివల్ల ఎలాంటి ద్రవ్య ప్రభావం ఉండదని స్పష్టం చేశారు. కాగా, ఈ బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలపడంతో తిరిగి లోక్‌సభకు పంపుతారు. దీంతో మనీబిల్లుకు సంబంధించిన పార్లమెంటరీ ప్రక్రియ పూర్తవుతుంది.











