ప్రస్తుత జనరేషన్ పిల్లలు.. తమకు అన్నింటికన్నా ఫోనే ఎక్కువన్నట్లు ప్రవర్తిస్తున్నారు. ఈ క్రమంలోనే విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఫోన్ ఎక్కువగా మాట్లాడొద్దని కన్న తండ్రి తిట్టాడని ఓ విద్యార్థిని తన ప్రాణాలే వదిలేసింది. ఈ ఘటన హైదరాబాద్ లోని ఛత్రినాకలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. శ్రీనివాస్ అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి ఛత్రినాకలో నివాసం ఉంటున్నాడు. అతని 17ఏళ్ల కూతురు తేజస్వీ.. ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతోంది.

అయితే, తేజస్వీని రోజూ అర్ధరాత్రి వరకు ఫోన్ లోనే ఉండటం, ఫోన్ మాట్లాడుతుడటాన్ని తండ్రి శ్రీనివాస్ గుర్తించి మందలించాడు. ఈ క్రమంలో మనస్తాపానికి గురై అర్దరాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లింది. గమనించిన శ్రీనివాస్ ఆమె వెనుకాలే వెళ్లాడు. అలా ఉప్పుగూడ రైల్వే ట్రాక్ పైకి వెళ్లి వేగంగా వస్తున్న గూడ్స్ రైలు కిందపడి..తండ్రి కళ్ల ముందే ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.