హైదరాబాద్: ఏడాది లోపే ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి ఆడబిడ్డల పేరుమీద ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. కులం, మతం, పార్టీ చూడకుండా అర్హులందరికీ ఇళ్లు ఇచ్చామని అన్నారు. హైదరాబాద్ క్యూర్ పరిధిలో ఇందిరమ్మ టవర్స్ లాటరీ కార్యక్రమం జరిగింది. నాంపల్లి నియోజకవర్గంలోని లక్కీ డ్రాలో పొంగులేటి పాల్గొన్నారు. మొదటి దఫాలో 7,340 ఇందిరమ్మ ఇళ్లను అర్హులకు ప్రభుత్వం అందించనుంది. ఆయా నియోజకవర్గాల్లో 4 రోజుల పాటు లక్కీ డ్రా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పారదర్శకంగా లక్కీ డ్రాతోనే ఇళ్లను కేటాయిస్తున్నామని, అర్హులైన పేదలకు ఇళ్లు ఇస్తున్నామని తెలియజేశారు. మరో 10 రోజుల్లో రెండో విడత జాబితా విడుదల చేస్తామని, ప్రభుత్వం తరఫున ప్రతి ఇంటికి రూ.5 లక్షలు ఇచ్చామని అన్నారు. 16 నియోజకవర్గాల్లో స్థలాలు సేకరించి టెండర్లు పూర్తి చేశామని, రెండు, మూడ్రోజుల్లో టవర్ల నిర్మాణం ప్రారంభిస్తారని పొంగులేటి పేర్కొన్నారు. ఇళ్ల రిజిస్ట్రేషన్ కు ఎలాంటి ఛార్జీలు వసూలు చేయట్లేదని అన్నారు. 10 ఏళ్ల తర్వాత ఇంటిని అమ్ముకునే హక్కు ఉందని, ఇల్లు రిజిస్ట్రేషన్ అయిన తర్వాత వాటిని తాకట్టు పెట్టుకునేందుకు అనుమతి ఉంటుందని పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.