జంతర్ మంతర్‌లో విద్యార్థులపై పోలీసుల అమానవీయ దాడులపై నిలదీసేందుకు సిద్ధమవుతున్న విపక్షం

ప్రధాని మోడీ క్షమాపణకు పట్టుపట్టే అవకాశం

హోంమంత్రి అమిత్ షాకు విపక్ష నేత రాహుల్ గాంధీ ఘాటైన లేఖ

నిరసనకారులపై పెల్లెట్ గన్స్‌కు మీరే అనుమతించారా? అని నిలదీత

బాధ్యులపై కఠిన చర్యలకు డిమాండ్

న్యూఢిల్లీ: ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పో లీసులు దారుణంగా వ్యవహరించారన్న ఆ రోపణలపై పార్లమెంటులో ప్రభుత్వాన్ని నిలదీసేందుకు కాంగ్రెస్ నేతృత్వంలోని ప్ర తిపక్షాలు సిద్ధమవుతున్నాయి. విద్యార్థులపై దాడికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవడంతోపాటు ప్రధానమంత్రి నరేం ద్ర మోదీ క్షమాపణ చెప్పాలని పట్టుబట్టనున్నట్లు సంబంధిత వర్గాలు ఆదివారం తెలిపా యి. అయితే పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహంతోపాటు రెండేళ్ల కిందటి ప్రశ్నపత్రాల లీకేజీ నిరోధక చట్టానికి సవరణలు చేస్తూ ప్రభుత్వం తీసుకురానున్న బిల్లుపై వైఖరిని సోమవారం ఖరారు చేయనున్నారు. రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే పార్లమెంటు కార్యాలయంలో సోమవారం ఉదయం జరి గే ఇండియా కూటమి సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోనున్న ట్లు సమాచారం.

విద్యార్థులపై ‘అమానవీయ దాడి’కి బాధ్యులెవరో తేల్చాలని కోరుతూ లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. పెల్లెట్ గన్స్ సహా ప్రాణాంతక ఆయుధాలను ఉపయోగించేందుకు ఆయన అనుమతి ఇచ్చారా అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు అత్యంత కీలకమని రాహుల్ తన లేఖలో పేర్కొన్నారు. నిరసనకారులను రక్షించడంతోపాటు వారి సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించడం ప్రభుత్వ బాధ్యతని స్పష్టం చేశారు. “ఇలాంటి క్రూరమైన హింస అన్ని ప్రమాణాలనూ ఉల్లంఘించింది. దేశ ప్రజలను తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. దేశ భవిష్యత్తయిన యువత, విద్యార్థులు సమాధానాలు, జవాబుదారీతనం కోరుతున్నారు. వారి గొంతు వినిపించేలా చేస్తాం” అని పేర్కొన్నారు.

రాహుల్ లేఖను కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. “విద్యార్థులపై పెల్లెట్ గన్స్ సహా ప్రాణాంతక ఆయుధాలను ఉపయోగించేందుకు హోంమంత్రిగా మీరు అనుమతించారా? ఇవ్వకపోతే ఎవరు అనుమతించారు? సాధారణ దుస్తుల్లో విద్యార్థులపై దాడి చేసినవారు పోలీసులా? వాలంటీర్లా? వారిని ఎవరు నియమించారు?” అని రాహుల్ ప్రశ్నించినట్లు తెలిపారు. ఈ కీలక ప్రశ్నలకు హోంమంత్రి సోమవారం పార్లమెంటులో సమాధానం చెప్పాలని, విద్యార్థులకు ప్రధాని క్షమాపణ చెప్పాలని జైరాం రమేశ్ డిమాండ్ చేశారు.

విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను విద్యార్థుల విజయంగా కాంగ్రెస్ అభివర్ణించింది. అయితే ప్రధాని కూడా విద్యార్థులకు క్షమాపణ చెప్పాల్సిందేనని స్పష్టం చేసింది. ఆందోళన చేస్తున్న విద్యార్థులపై లాఠీలు, పెల్లెట్ గన్స్ ప్రయోగించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మల్లికార్జున ఖర్గే డిమాండ్ చేశారు. ఇక విద్యార్థులకు క్షమాపణ చెప్పాల్సిన వంతు ప్రధాని మోదీదేనని పేర్కొన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనంతరం రాహుల్ గాంధీ కూడా ఇదే డిమాండ్ చేశారు. దేశ భవిష్యత్తుపై గౌరవంతోపాటు ఆందోళన సమయంలో విద్యార్థులపై జరిగిన ‘దౌర్జన్యాలకు’ ప్రధాని క్షమాపణ చెప్పాలని కోరారు. విద్యావ్యవస్థను పునర్నిర్మించే దిశగా ప్రధాన్ రాజీనామా కీలక ముందడుగని పేర్కొన్నారు. “ఆయన ఒక ప్రతీక కాబట్టి ఇది ప్రతీకాత్మక చర్యే. అయినప్పటికీ ఇదొక పెద్ద ముందడుగు” అని వ్యాఖ్యానించారు. “ఇంతటితో ముగియలేదు. విద్యార్థులకు ప్రధాని క్షమాపణ చెప్పాల్సి ఉంది” అని జైరాం రమేశ్ పేర్కొన్నారు. విద్యార్థులపై మితిమీరిన బలప్రయోగానికి బాధ్యులైన వారిని జవాబుదారీ చేయాలని మరోసారి డిమాండ్ చేశారు.

ప్రశ్నపత్రాల లీకేజీపై కీలక బిల్లు

పార్లమెంటు ఉభయ సభల్లో కొనసాగుతున్న ప్రతిష్టంభనకు ప్రభుత్వం, ప్రతిపక్షాలు తెరదించితే ప్రశ్నపత్రాల లీకేజీ అంశంపై వాడీవేడి చర్చ జరిగే అవకాశముంది. ‘పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) సవరణ బిల్లు-2026’ను ప్రవేశపెట్టడానికి ముందే లోక్‌సభ సభ్యులకు పంపిణీ చేశారు. ప్రశ్నపత్రాల లీకేజీ లేదా పరీక్షల్లో అక్రమాలకు పాల్పడిన వారికి కనీసం ఐదేళ్ల నుంచి గరిష్ఠంగా పదేళ్ల వరకు జైలు శిక్ష, రూ.50 లక్షల వరకు జరిమానా విధించాలని బిల్లులో ప్రతిపాదించారు. వ్యవస్థీకృత నేరాలకు పాల్పడితే కనీసం ఏడేళ్ల జైలు శిక్షతోపాటు రూ.10 కోట్ల వరకు జరిమానా విధించే ప్రతిపాదన ఉంది.

ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టం ప్రకారం పరీక్షల్లో అక్రమాలకు పాల్పడిన వారికి కనీసం మూడు నుంచి ఐదేళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. వ్యవస్థీకృతంగా పరీక్షల్లో అక్రమాలకు పాల్పడేవారికి ఐదు నుంచి పదేళ్ల జైలు శిక్షతోపాటు కనీసం రూ.కోటి జరిమానా విధించే నిబంధనలు ఉన్నాయి. కొత్త బిల్లును సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టి, చర్చించి, ఆమోదించేందుకు ప్రభుత్వం జాబితాలో చేర్చింది. సాధారణంగా ఒక బిల్లును ప్రవేశపెట్టడం, అదేరోజు ఆమోదించడం కోసం జాబితాలో చేర్చడం అరుదు. నీట్ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంపై కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నేతృత్వంలో విద్యార్థుల ఆందోళనలు ఇటీవల తీవ్రరూపం దాల్చిన నేపథ్యంలో చట్ట సవరణకు ప్రభుత్వం సిద్ధమైంది.

నీట్ అంశంపై ప్రతిపక్షాల నిరసనల కారణంగా పార్లమెంటు సమావేశాల తొలి వారంలో కార్యకలాపాలు స్తంభించాయి. అయితే కొత్త బిల్లుపై ప్రతిపక్షాల వైఖరి ఇంకా స్పష్టం కాలేదు. ప్రతిపాదిత చట్టానికి కాంగ్రెస్ మద్దతు ఇస్తుందా అని శనివారం ప్రశ్నించగా.. దీనిపై తమ పార్టీ ఒక్కటే నిర్ణయం తీసుకోదని రాహుల్ గాంధీ తెలిపారు. ప్రతిపక్ష పార్టీల సమావేశంలో చర్చించి, అందరి ఏకాభిప్రాయం ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. “పార్లమెంటులో ఇదే మా క్రమశిక్షణ. మేం ఇలాగే పనిచేస్తాం” అని రాహుల్ పేర్కొన్నారు.