
మన తెలంగాణ/క్రీడా విభాగం: శ్రీలంక గడ్డపై జరిగే రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ టీమిండియాకు సవాల్‌గా మారింది. లంకను వారి సొంత గడ్డపై ఎదుర్కొవడం భారత్‌కు తేలిక కాదనే చెప్పాలి. ఇటీవల కాలంలో టెస్టుల్లో టీమిండియా వరుస ఓటములతో సతమతమవుతోంది. విదేశీ గడ్డపైనే కాకుండా స్వదేశంలోనూ భారత్‌కు పరాజయాలు తప్పడం లేదు. భారత టెస్టు క్రికెట్ చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా సొంత గడ్డపై న్యూజిలాండ్, సౌతాఫ్రికాల చేతుల్లో వైట్‌వాష్‌కు గురైంది. ఇలాంటి స్థితిలో లంకలో జరిగే సిరీస్‌లో గెలవడం అనుకున్నంత తేలిక కాదనే చెప్పాలి. స్వదేశంలో లంక ఎప్పుడైనా ప్రమాదకర జట్టే. సొంత పిచ్‌లపై అసాధారణ రీతిలో చెలరేగి పోవడం లంకకు పరిపాటి. ఇటీవల కాలంలో లంక గాడిలో పడింది. పలు సిరీస్‌లలో నిలకడైన ప్రదర్శనతో అలరిస్తోంది. బంగ్లాదేశ్, న్యూజిలాండ్, పాకిస్థాన్, ఇంగ్లండ్, జింబాబ్వేలతో జరిగిన సిరీస్‌లలో మెరుగైన ప్రదర్శన చేసింది.
భారత్‌పై కూడా అదే జోరును కొనసాగించాలనే లక్షంతో ఉంది. మరోవైపు టీమిండియా ఇటీవల కాలంలో పేలవమైన ఆటతో నిరాశ పరుస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో తన స్థాయికి తగ్గ ఆటను కనబరచలేక పోతోంది. బలమైన లంకను ఎలా ఎదుర్కోంటుందనేది సందేహంగా మారింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్, రాహుల్, యశస్వి, రిషబ్, జురేల్, పడిక్కల్, జడేజా తదితరులతో భారత బ్యాటింగ్ బలంగానే ఉంది. అంతేగాక సిరాజ్, కుల్దీప్, ప్రసిద్ధ్ కృష్ణ, అకిబ్ నబి, మానవ్ సుతార్, సారాంశ్ జైన్ తదితరులతో బౌలింగ్ కూడా బాగానే ఉన్న సంగతి తెలిసిందే. గాయంతో సీనియర్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా జట్టుకు దూరం కావడం కాస్త ప్రతికూల అంశంగానే చెప్పాలి. బుమ్రా స్థానంలో కశ్మీర్ బౌలర్ నబికి చోటు దక్కింది. దేశవాళీ క్రికెట్‌లో నబి అత్యంత నిలకడైన ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. రెండు విభాగాల్లో బలంగానే ఉన్నా టీమిండియా టెస్టుల్లో ఆశించిన స్థాయిలో రాణించలేక పోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో లంకతో సిరీస్ భారత్‌కు సవాల్‌గా తయారైంది. ఇందులో ఎంతవరకు సఫలమవుతుందో వేచి చూడాల్సిందే.











