
గ్లాస్గో: నాప్‌కిన్‌లపై అసంపూర్తిగా భారత మ్యాప్‌ను ముద్రించిన గ్లాస్గోలోని రెస్టారెంట్ ఎట్టకేలకు క్షమాపణలు చెప్పింది. భారత బాక్సర్ లవ్లీనాతో పాటు కొందరు అథ్లెట్లు సదరు రెస్టారెంట్‌కి వెళ్లగా.. అక్కడ ఈశాన్య రాష్ట్రాలు, కశ్మీర్‌లోని కొంత భాగం లేని భారత మ్యాప్‌ను గమనించారు. దీనిపై లవ్లీనాతో పాటు బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. మ్యాప్ వివాదంపై స్కాట్‌లాండ్‌లోని భారత్ ఎంబసీ కూడా స్పందించింది. ఈ క్రమంలో సదరు రెస్టారెంట్ క్షమాపణలు చెప్పడంతో పాటు.. తమ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను కూడా డిలీట్ చేసింది. లోగోను కూడా మారుస్తామంటూ ప్రకటన చేసింది.
‘‘మేము భారతీయ వారసత్వం పట్ల గేం గర్వపడుతున్నాం. భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 32 ఏళ్లుగా మేం సేవలు అందిస్తున్నాం. అయితే, భారత మ్యాప్‌ను తప్పుగా చూపించినందుకు తొలుత మేం క్షమాపణలు చెబుతున్నాం. పొరపాటు సరిదిద్దడానికి తక్షణ చర్యలు తీసుకుంటాం. ఇది ఎవరినీ నొప్పించాలని చేసింది కాదు. భారత బృందానికి గర్వంగా సేవలు చేయాలనుకుంటున్నాం. సరైన మ్యాప్‌తో లోగోను మారుస్తాం. కామన్‌వెల్త్ గేమ్స్‌లో అద్భుత విజయాలు సాధించిన భారత అథ్లెట్లకు ఆతిథ్యం ఇవ్వడం మాకు దక్కిన గొప్ప గౌరవం. ఈ జ్ఞాపకాలు మాతో శాశ్వతంగా నిలిచిపోతాయి’’ అని మిస్టర్ సింగ్స్ ఇండియా టీమ్ అధికారికంగా ప్రకటన జారీ చేసింది.











