తాళాలు వేసిన ఇళ్లల్లో వరుసగా దొంగతనాలు చేస్తున్న అంతర్ జిల్లా ముఠాను జూబ్లీహిల్స్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. ముగ్గురు నిందితులు, రిసీవర్‌ను అరెస్టు చేసిన పోలీసులు రూ.12 లక్షల విలువైన 80గ్రాముల బంగారం, 258 గ్రాముల వెండి వస్తువులు, నాలుగు మొబైల్ ఫోన్లు, రెండు బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసు కథనం ప్రకారం.. సూరారం, దయానందం కాలనీకి చెందిన ప్రధాన నిందితుడు దేరంగుల హరిబాబు అలియాస్ నాని, తన్నీరు సూర్య అలియాస్ సూరి, నరాల రాహుల్ కలిసి ముఠాగా ఏర్పడి చోరీలు చేస్తున్నారు. వీరి చోరీ చేసిన సొత్తును మౌలాలీకి చెందిన సబావత్ రవి రిసీవర్‌గా ఉన్నాడు. ముగ్గురు నిందితులు కలిసి జిల్లాలు, కమిషనరేట్ల పరిధిలో చోరీలు చేశారు.

ప్రధాన నిందితుడు హరిబాబు జూన్, 2026లో జైలు నుండి విడుదలయ్యాడు. జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత తన్నీరు సూర్య, నరాల రాహుల్‌లతో కలిసి ఒక ముఠాగా ఏర్పడి తాళం వేసి ఇళ్లల్లో వరుసగా దొంగతనాలు చేశారు. నిందితుడు హరిబాబుపై గతంలో 27 కేసులు, సూర్యపై 13 కేసులు, రాహుల్‌పై 3 కేసులు ఉన్నాయి. ఈ ముఠా గౌరారం, సంగారెడ్డి టౌన్, పోచారం ఐటీ కారిడార్, నాగోల్, కుషాయిగూడ, మేడిపల్లి, వనస్థలిపురం పోలీసు స్టేషన్ల పరిధిలో 11 చోరీలు చేశారు. హైదరాబాద్ వెస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ సిహెచ్. యాదేందర్, జూబ్లీహిల్స్ జోన్ టాస్క్‌ఫోర్స్ ఎస్సై డి. రవి రాజ్, సిబ్బంది నిందితులను పట్టుకున్నారు.