
2013లో తన సహోద్యోగినిపై అత్యాచారానికి పాల్పడ్డారన్న కేసులో మాజీ తెహెల్కా సంపాదకుడు తరుణ్ తేజ్‌పాల్‌ను బాంబే హైకోర్టు గురువారం దోషిగా నిర్ధారించింది. ఐదేళ్ల క్రితం గోవా సెషన్స్ కోర్టు ఇచ్చిన నిర్దోషి తీర్పును రద్దు చేస్తూ, ఆయనకు పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది.బాంబే హైకోర్టు గోవా ధర్మాసనానికి చెందిన న్యాయమూర్తులు నీలా గోఖలే, అమిత్ జంసాండేకర్ ఈ తీర్పును వెలువరించారు. తొలుత రెండు వారాల్లో లొంగిపోవాలని ఆదేశించిన న్యాయస్థానం, తేజ్‌పాల్ తరఫు న్యాయవాదుల విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని గడువును నాలుగు వారాలకు పొడిగించింది. ఈ ఘటన జరిగి దాదాపు 13 సంవత్సరాలు గడిచాయని, అప్పటి నుంచి తేజ్‌పాల్ మరే ఇతర నేరానికి పాల్పడలేదని పేర్కొంటూ కనిష్ఠ శిక్షను విధిస్తున్నట్లు హైకోర్టు తెలిపింది. ప్రస్తుతం బాధితురాలు, తేజ్‌పాల్ ఇద్దరూ తమ జీవితాల్లో ముందుకు సాగి ఉండవచ్చని కూడా వ్యాఖ్యానించింది.
అదే సమయంలో తేజ్‌పాల్‌పై రూ.10.21 లక్షల జరిమానా కూడా విధించింది. ఈ మొత్తం మొత్తాన్ని లైంగిక దాడికి గురైన బాధితురాలికే చెల్లించాలని కోర్టు ఆదేశించింది.తాను రాజకీయంగా వేధింపులకు గురైన వ్యక్తినని, ఇద్దరు కుమార్తెల తండ్రినని పేర్కొంటూ శిక్ష విషయంలో కనికరం చూపాలని తేజ్‌పాల్ కోర్టును కోరారు. అయితే గోవా ప్రభుత్వ తరఫున వాదించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాత్రం ‘కాదు’ అంటే ‘కాదు’ అనే స్పష్టమైన సందేశం సమాజానికి వెళ్లాలి అంటూ గరిష్ఠ శిక్ష విధించాలని కోరారు. ట్రయల్ కోర్టు ఇచ్చిన నిర్దోషి తీర్పును రద్దు చేస్తున్నాం. ప్రతివాది తరుణ్ తేజ్‌పాల్ దోషిగా తేలారు అని హైకోర్టు ధర్మాసనం ప్రకటించింది.భారతీయ శిక్షాసృ్మతిలోని సెక్షన్ 376(2)(ఎఫ్) (నమ్మకస్థానం లేదా అధికార స్థానంలో ఉండి మహిళపై అత్యాచారం), సెక్షన్ 354(ఎ) (లైంగిక వేధింపులు),
సెక్షన్ 354(బి) (మహిళను బలవంతంగా వివస్త్రం చేసే ఉద్దేశంతో దాడి) కింద తేజ్‌పాల్‌ను దోషిగా నిర్ధారించింది. సెక్షన్ 376(2)(ఎఫ్) కింద పదేళ్ల కఠిన కారాగార శిక్ష, సెక్షన్ 354(ఎ) కింద ఏడాది, సెక్షన్ 354(బి) కింద మూడేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ శిక్షలన్నీ ఏకకాలంలో అమలవుతాయని తెలిపింది. కోర్టు తీర్పు అనంతరం స్పందించిన తేజ్‌పాల్, ఈ తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేస్తామని తెలిపారు. తమపై వచ్చిన తీర్పు తప్పిదమని భావిస్తున్నామని, అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని మీడియాతో చెప్పారు. ఈ కేసు 2013 నవంబరులో గోవాలో జరిగిన థింక్‌ఫెస్ట్ కార్యక్రమం సందర్భంగా ఓ హోటల్ లిఫ్ట్‌లో తనపై లైంగిక దాడి జరిగిందని తేజ్‌పాల్ మాజీ జూనియర్ సహోద్యోగిని చేసిన ఆరోపణలకు సంబంధించినది. 2021లో ట్రయల్ కోర్టు తేజ్‌పాల్‌ను నిర్దోషిగా విడుదల చేయగా, ఆ తీర్పును గోవా ప్రభుత్వం హైకోర్టులో సవాలు చేసింది.
తేజ్‌పాల్ తరఫు న్యాయవాది ఆబాద్ పొండా మాట్లాడుతూ, విచారణ ప్రారంభం నుంచి ఆయన బెయిల్‌పై ఉన్నారని, కోర్టు విధించిన ఏ నిబంధననూ ఉల్లంఘించలేదని, వృద్ధుడైనందున కనిష్ఠ శిక్ష విధించాలని కోరారు. అలాగే సుప్రీంకోర్టులో అప్పీల్ దాఖలు చేసేందుకు కనీసం పది వారాల పాటు శిక్ష అమలును నిలిపివేయాలని విజ్ఞప్తి చేశారు. దీనికి ప్రతిగా తుషార్ మెహతా మాట్లాడుతూ, బాధితురాలిపై ఆధిపత్య స్థితిని దుర్వినియోగం చేసిన తేజ్‌పాల్ ఎలాంటి పశ్చాత్తాపం వ్యక్తం చేయలేదన్నారు. బాధితురాలు ఆయన సహోద్యోగి మాత్రమే కాకుండా, కుమార్తె స్నేహితురాలు కూడా అని గుర్తు చేశారు. సంఘటన జరిగిన మరుసటి రోజూ ఆయన అదే తరహా ప్రవర్తన కొనసాగించారని, అనంతరం బాధితురాలి ప్రవర్తనను ప్రశ్నిస్తూ ఆమెను అపఖ్యాతిపాలు చేసే ప్రయత్నం చేశారని ఆరోపించారు.
శిక్ష నేరానికి తగినట్టుగా ఉండాలని, మహిళల సమ్మతి విషయంలో కాదు అంటే కాదు అనే స్పష్టమైన హెచ్చరిక సమాజానికి వెళ్లాల్సిన అవసరం ఉందని మెహతా వాదించారు. లైంగిక దాడి బాధితురాలు ఎలా ప్రవర్తించాలనే ముందస్తు అభిప్రాయాలతో ట్రయల్ కోర్టు ఆమె ప్రవర్తనను అంచనా వేయడం తీవ్రమైన పొరపాటని, బాధితుల ప్రతిస్పందన ప్రతి వ్యక్తి పరిస్థితులు, వ్యక్తిత్వం, సామాజిక నేపథ్యాన్ని బట్టి మారుతుందని కూడా ఆయన హైకోర్టుకు వివరించారు.
సుప్రీంకోర్టును ఆశ్రయిస్తా: తరుణ్ తేజ్‌పాల్
తరుణ్ తేజ్‌పాల్ స్పందిస్తూ.. తాను రాజకీయ వేధింపులకు గురైన వ్యక్తినని పేర్కొంటూ, ఈ తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేస్తామని గురువారం ప్రకటించారు. హైకోర్టు తీర్పు అనంతరం మీడియాతో మాట్లాడిన తేజ్‌పాల్, ఈ తీర్పు తప్పిదమని మేము భావిస్తున్నాం. దీనిపై తప్పకుండా సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం. చివరికి నిజం వెలుగులోకి వస్తుందనే నమ్మకం మాకు ఉంది అని అన్నారు. తెహెల్కాలో జర్నలిస్టుగా చేసిన పనుల కారణంగానే గత 13 ఏళ్లుగా తనను లక్ష్యంగా చేసుకున్నారని తేజ్‌పాల్ ఆరోపించారు. ట్రయల్ కోర్టులో ఏడేళ్లపాటు పోరాడి నిర్దోషిగా బయటపడ్డాం. ఇప్పుడు మళ్లీ మమ్మల్ని లక్ష్యంగా చేసుకుంటున్నారు అని వ్యాఖ్యానించారు. అధికారంలో ఉన్నవారిపై మాట్లాడినవారు, రాసినవారిపై కేసులు పెడుతున్నారని ఆయన ఆరోపించారు. అధికార పక్షానికి అనుకూలంగా ఉన్నవారిని విడిచిపెడుతున్నారని, విమర్శించినవారినే వేధిస్తున్నారని అన్నారు. గత 12 ఏళ్లలో అధికారాలను ప్రశ్నించిన ఎంతో మందిని వివిధ కేసుల్లో ఇరికించారు. ఉమర్ ఖాలిద్ ఆరేళ్లుగా జైలులో ఉన్నారు. మాలాంటి వారు ఇంకా చాలా మంది ఉన్నారు అని తేజ్‌పాల్ పేర్కొన్నారు. ఈ కేసు కారణంగా తన జర్నలిజం జీవితమే ముగిసిపోయిందని, తన వృత్తి పూర్తిగా దెబ్బతిన్నదని కూడా ఆయన ఆరోపించారు. అలాగే తన పుస్తకాల ముద్రణను కూడా నిలిపివేశారని తేజ్‌పాల్ అన్నారు.











