
మన తెలంగాణ/హైదరాబాద్ : నగరంలోని ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ (ఎఐజి) ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ నటుడు, హిందూపురం ఎంఎల్‌ఎ నందమూరి బాలకృష్ణను ఎపి సిఎం చంద్రబాబు ఆదివారం పరామర్శించారు. గత వారం సినిమా షూటింగ్‌లో గాయపడిన బాలకృష్ణకు ఇటీవల మోకాలికి విజయవంతంగా శస్త్రచికిత్స జరిగిన విషయం విదితమే. ఈ సందర్భంగా చంద్రబాబు తన బావమరిది అయిన బాలకృష్ణ ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ఆయన ఎంత వేగంగా కోలుకుంటున్నదీ వాకబు చేశారు.
అనంతరం వైద్యులతో ప్రత్యేకంగా మాట్లాడి బాలకృష్ణకు అందిస్తున్న చికిత్స, తదుపరి పునరావాస ప్రణాళికల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం బాలకృష్ణ ఆరోగ్యం నిలకడగా ఉందని, నిపుణుల బృందం పర్య వేక్షణలో ఉన్నారని పేర్కొన్నాయి. మరికొన్ని రోజుల పాటు విశ్రాంతి అవసరమని వైద్య బృందం స్పష్టం చేసింది. వైద్యుల సూచనల మేరకు త్వరలోనే బాలకృష్ణ డిశ్చార్జ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సంపూర్ణ ఆరోగ్యంతో బాల కృష్ణ తిరిగి ఇంటికి చేరుకోవాలని, మళ్లీ ఎప్పటి లాగే షూటిం గ్‌లలోనూ, ప్రజా సేవలోనూ వేగంగా పాల్గొనాలని అభిమానులు సామాజిక మాధ్య మాల వేదికగా ఆకాంక్షిస్తున్నారు.











