
సమాజానికి కళ్ళు, కాళ్ళు అయిన ప్రభుత్వ బడికి పట్టిన గ్రహణం వీడేదెట్లా? ఇప్పుడు ఇదే ప్రశ్న దేశ ప్రజలను తొలిచేస్తున్న అంశం. ప్రభుత్వ బడులు, ప్రైవేటు బడుల్లో కూడా క్రమంగా నమోదు పడిపోతుంది. ప్రభుత్వ బడిలో ఈ పరిణామం మరింత వేగంగా కొనసాగుతుంది. ఇటీవల కేంద్రం విడుదల చేసిన గణాంకాలననుసరించి రోజుకు 25 పాఠశాలల చొప్పున గడిచిన 10ఏళ్ళలో 94వేల పాఠశాలలు మూతపడ్డాయి. మోత్తంమీద 2.26 కోట్ల మంది విద్యార్థుల నమోదు తగ్గింది. మన రాష్ట్రం కూడా బడులమూతలో అగ్రస్థానంలోనే ఉంది. పార్లమెంటులో ప్రకటించిన గణాంకాలు ననుసరించి గత ఏడాది 1920 పాఠశాలలు రాష్ట్రంలో మూతపడ్డాయి. అందులో 1400 ఏకోపాధ్యాయ ప్రాథమిక పాఠశాలలే! అంతేకాదు పాఠశాలల మూత, నమోదు క్షీణతలో మనం దేశంలోనే రెండవ స్థానంలో నిలిచాము.
ఇంకా ఒకటి రెండు సంవత్సరాలలో 10వేల ఏకోపాధ్యాయ ప్రాథమిక పాఠశాలలు పాఠశాల క్రమబద్ధీకరణ జిఒ 25, 2021 ప్రకారం పదిమంది కంటే తక్కువ పిల్లల నమోదు ప్రాథమిక పాఠశాలలో ఉంటే సమీప పాఠశాలల్లో విలీనం కానున్నాయి. అంటే చాలామంది బడి ఈడు పిల్లలకు పాఠశాల యాక్సెస్ తగ్గిపోతుంది. ఈ పరిస్థితికి కారణం ఏమిటి? అనేది నేడు సమాజం ముందు ఉన్న ప్రశ్న. నమోదు పడిపోవడానికి ప్రధాన కారణం 1) సంతానోత్పత్తి తగ్గిపోవడం: అంటే చాలా ఆలస్యం అవుతున్న వివాహాలు మూలంగా సంతానోత్పత్తి (ఫెర్టిలిటీ) శాతం పడిపోతుంది. అంతేకాదు, స్త్రీ పురుష నిష్పత్తిలో వచ్చిన వైవిధ్యం వల్ల చాలా మంది యువత పెళ్ళికాని ప్రసాదులుగా మిగిలిపోతున్నారు.
ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నం అయి ఏకాకులు అవుతున్న స్థితి కనిపిస్తుంది. 2) పెరిగిన వలసలు: ఇప్పటికే యువత సుమారు 5 కోట్లమంది వివిధ దేశాలకు మేధో, శ్రామిక వలసగా వెళ్ళి అక్కడే స్థిరపడ్డారు. ఫలితంగా వారిపిల్లలకు అక్కడే మెరుగైన విద్య లభిస్తుందనే భావన ఉండడం వలన అక్కడే స్థిరపడుతున్నారు. గ్రామీణ ప్రాంతం నుండి కూడా వలసలు పెరగడం మూలంగా 20 శాతం గృహాలు పడావుపడి, తాళం కప్పలు వేలాడుతున్నాయి. ఈ సంఖ్య మరింత పెరిగితే గ్రామీణ వ్యవస్థలో అసహజ మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. 3) గ్లోబల్ మార్పులు: ప్రపంచీకరణ, సరళీకరణ, ప్రైవేటీకరణ విధానాలు మూలంగా పట్టణీకరణ పెరిగింది.
అంతేకాదు విద్య, అవసరాలు, విధానాల్లో వచ్చిన మార్పుల్ని ప్రైవేటు విద్యా వ్యవస్థ అందుకున్నంతగా ప్రభుత్వ వ్యవస్థ అందుకోలేక సాంప్రదాయ బోధనకు పరిమితం అయింది. ఆంగ్ల మాధ్యమం, కంప్యూటర్ శిక్షణ ఇత్యాది ఆధునిక మార్పులు ఆలస్యంగా ప్రభుత్వ పాఠశాల గమనించడం వలన నష్టం జరిగింది. 4) ప్రభుత్వ అనాలోచిత విధానాలు: వీటికి తోడు వివిధ ప్రభుత్వాలు అనుసరించిన విధానాలు అన్నింటికంటే ఎక్కువగా ప్రభుత్వ విద్యా రంగం దెబ్బ తినడానికి కారణం అయింది. విద్యా బాధ్యతల నుండి వైదొలగే ప్రయత్నంలో భాగంగా పరోక్షంగా ప్రైవేటు విద్యా వ్యవస్థను ప్రోత్సహించారు. అభివృద్ధికి ప్రధాన సూచిక అయిన ప్రభుత్వ విద్యకు బడ్జెట్లో కేటాయింపులు తగ్గిస్తూ వచ్చారు. ఉదాహరణకు తెలంగాణలో రెండు లక్షల పైచిలుకు ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉంటే ప్రస్తుతం ఆ సంఖ్య లక్షకు పడిపోయింది.
పాలకులు కూడా ఉన్న పాఠశాలల సంస్కరణ కాకుండా తమ ముద్రకోసం ఇష్టంవచ్చిన రీతిగా వివిధ పేర్లతో కొత్త పాఠశాలలు నిర్మించి కోట్లాది రూపాయల ప్రజాధనం హెచ్చిస్తున్నారు. ఒకే హ్యాబిటేషన్‌లో ఒకే పాఠశాల ఉండాల్సి ఉండగా అందుకు భిన్నంగా అనేక ప్రభుత్వ బడులు, అదుపు లేకుండా ప్రైవేటు పాఠశాలలు ఏర్పడ్డాయి. ఫలితంగా ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల నమోదు దారుణంగా పడిపోయింది. ఎలక్ట్రానిక్ హాజరు విధానం వచ్చిన తర్వాత, ఆధార్ అనుసంధానం తర్వాత వివిధ పాఠశాలల్లో విద్యార్థుల హాజరులో పారదర్శకత చోటు చేసుకుంది. కనుక నమోదులో అవకతవకలు చూపడం కూడా సాధ్యం కాని స్థితి ఏర్పడింది. ఇప్పటికీ ప్రభుత్వ బడుల్లో సరైన సౌకర్యాలు లేవు. 5) సామాజిక సహాకారం: లోపించిన సహకార భావం కూడా పాఠశాల అభివృద్ధికి ప్రధాన ఆటంకంగా మారింది. గతంలో గ్రామీణ, పట్టణ ప్రాంత రాజకీయ నాయకులు భూదానాలు, భూరి విరాళాలతో విద్యా వ్యవస్థకు సహకరించే వారు. ప్రభుత్వం నుంచి అభివృద్ధిలో కూడా విద్యా ప్రాధాన్యత ప్రధానాంశంగా ఉండేది.
ప్రస్తుతం వారి ప్రాధాన్యత గుడులు, గోపురాలు, చర్చి, మసీదుల నిర్మాణం వైపు మళ్ళింది. ప్రజల దృష్టి కూడా ఆదిశగానే మళ్ళింది. ప్రభుత్వ పాఠశాల సమాజం నుండి దూరంగా జరుగుతున్న వాతావరణం కనిపిస్త్తుంది. ఇప్పటికే తెలంగాణ విద్యా కమిషన్ నివేదిక ననుసరించి రాష్ట్రంలోని 19 వేల ప్రాథమిక పాఠశాలల్లో 13 వేల ప్రాథమిక పాఠశాలలు 50 కంటే తక్కువ విద్యార్థుల నమోదు ఉంది. 5600 ఉన్నత పాఠశాలల్లో రాష్ట్రవ్యాప్తంగా 500 ఉన్నత పాఠశాలలు ఇప్పటికే మూతపడగా మరో మూడొంతులు పాఠశాలలు 50 కంటే తక్కువ సంఖ్యలో పిల్లల నమోదు ఉంది.
ఒక్కో పాఠశాలకు 8మంది బోధనా సిబ్బంది, ముగ్గురు బోధనేతర సిబ్బంది ఉన్నారు. ప్రభుత్వ బడిమూత ప్రైవేటు పాఠశాల వ్యవస్థకు వరంగా మారకూడదు. ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల నమోదు పెరగాలన్నా, ప్రభుత్వ బడిని కాపాడుకోవాలన్నా ప్రస్తుతం సామాజిక భాగస్వామ్యం, సహకారం పాత్ర కూడా ప్రధానమైనదే. ఉన్నప్రభుత్వ బడుల ఆస్తులు సద్వినియోగం అయ్యోలా పాఠశాల సంస్కరణ అవసరం.విద్యానంతర జీవితానికి మార్గదర్శకంగా ఉండే విద్యా పునాదులు అవసరం.విద్యా ప్రజాస్వామీకరణ దిశగా క్రమంగా కామన్ స్కూల్ విధానం వైపు సంస్కరణ ఉండాల్సిందే. ప్రభుత్వ బడులు ఉనికి నిలబడాలంటే నిలకడైన నమోదు శాంతంతోపాటు, ఆధునిక సవాళ్ళు అధిగమించే విద్య ప్రభుత్వ బడుల్లో అందుబాటులోకి తేవడం అత్యవసరం. ఆ దిశగా చిత్తశుద్ధితో ప్రయత్నాలు జరగాలి.
- ఎన్ తిర్మల్
94418 64514











