
తెలంగాణలో సుమారు పదివేల పాఠశాలలు మూతపడతాయనే ప్రాథమిక సమాచారం అటు ఉపాధ్యాయులు, ఇటు ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. వాస్తవంగా తెలంగాణలో 2021లో కెసిఆర్ ప్రభుత్వం ఇచ్చిన పాఠశాలలు హేతుబద్ధీకరణ జిఒ 25 ప్రకారం 0-19 మంది విద్యార్థులు ఉన్న ప్రాథమిక పాఠశాలలు ఏకోపాధ్యాయ పాఠశాలగా ఉనికిలో ఉన్నాయి. అట్లాంటి ఏకోపాధ్యాయ ప్రాథమిక పాఠశాలలు తెలంగాణ రాష్ట్రంలో 10వేల వరకు ఉన్నాయి. ఈ ఏడాది ప్రభుత్వ బడుల్లో 10 శాతం పిల్లల నమోదు లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ ఎక్కడా టార్గెట్ చేరుకోలేదు. ఉన్న నమోదునే మరింత దిగజారే పరిస్థితి కనిపిస్తోంది. ఒకవేళ ప్రాథమిక పాఠశాలలో 10మంది కంటే తక్కువ నమోదు ఉంటే జిఒ ఎంఎస్ నెంబర్ 25, 2021 ప్రకారం పాఠశాల మూసివేసి ఉపాధ్యాయులు, విద్యార్థులను సమీప పాఠశాలలకు తరలిస్తారు. గత ఏడాది ఈ విధంగా 1400 ఏకోపాధ్యాయ పాఠశాలలు మూతపడ్డాయి. కేంద్ర విద్యా గణాంకాలు ప్రకారం గత ఏడాది 1920 ప్రభుత్వ బడులు మూతపడితే అందులో 14 వందలు ఏకోపాధ్యాయ పాఠశాలలే మూత పడ్డాయి. వాస్తవంగా గత ప్రభుత్వాలు సర్వశిక్షా అభియాన్ నిబంధనలు ప్రకారం ఒక కిలోమీటరు పరిధిలో ప్రాథమిక పాఠశాల, మూడు కిలోమీటర్ల పరిధిలో ప్రాథమికోన్నత పాఠశాల, ఐదు కి.మీ పరిధిలో ఉన్నత పాఠశాల ఉండాలన్న సాధారణ నిబంధనలు ప్రకారం 2023-24 యూడైస్ గణాంకాలను అనుసరించి 19 వేల ప్రాథమిక పాఠశాలలు, 5600 ఉన్నత పాఠశాలలు, వెయ్యి వరకు గురుకుల విద్యాలయాలు ఉన్నాయి.
వీటికి కెజిబివి, నవోదయ, కేంద్రీయ విద్యాలయాలు, ఏకలవ్య పాఠశాలలు అదనం. ఒక లక్షా ఐదువేల ప్రభుత్వ ఉపాధ్యాయులు మంచి వేతనాలతో పనిచేస్తున్నారు. కేవలం తాత్కాలిక వేతనంపై పనిచేస్తున్న గురుకుల, కెజిబివి ఉపాధ్యాయులు ఉన్నారు. అయితే ఈ పాఠశాలల్లో మూడింట రెండువంతుల పాఠశాలలు కేవలం 50మంది విద్యార్థుల కంటే తక్కువ నమోదు కలిగి ఉన్నాయని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం నియమించిన విద్యా కమిషన్ రిపోర్టు వెల్లడి చేసింది. అంటే సమీప భవిష్యత్తులో ఈ మూడింటి రెండు వంతుల ప్రభుత్వ బడులలో విద్యావృథా, బోధన వృథా, వనరుల వృథా జరగనుంది. కనుక పాఠశాల హేతుబద్ధత జిఒ 25 ప్రకారం ప్రాథమిక పాఠశాలలు మూసివేసి సమీప పాఠశాలల్లో విలీనం, మిగతా పాఠశాలలు సంస్కరణ అన్యోపదేశంగానే ముందుకు వస్తుంది. ఈ దశలో ప్రభుత్వం తీసుకునే చర్యలు సామాన్య ప్రజలకు ఇబ్బంది కలిగించడం గానీ, సర్వశిక్షా అభియాన్ నిబంధనలు ప్రకారం పిల్లలు బడులు రద్దు చేసి యాక్సెస్ లెస్‌గా మార్చడం గానీ కరెక్ట్ కాదు! కానీ, ప్రభుత్వం ముందు ఉన్న ప్రత్యామ్నాయం ఏమిటి? ఆయా హ్యాబిటేషన్లలో బడిఈడుగల పిల్లలు లేక బడిలో పిల్లల నమోదు తగ్గడం లేదు. అంగట్లో అన్నీ ఉండి అల్లుడి నోట్లో శని ఉన్నట్లు మన ప్రభుత్వం బడుల పరిస్థితి తయారైంది.
ప్రజలు ఉచితంగా లభించే విద్యను సైతం త్యజించి ప్రైవేటు పాఠశాలల బాట పడుతున్నారు. ఒకవైపు వేగంగా జరుగుతున్న పట్టణీకరణ కూడా గ్రామీణ పాఠశాల మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్నది. ప్రభుత్వ బడి మూసివేత చాలా తేలికైన పదమే కానీ, అందువల్ల విద్యాహక్కు చట్టం ప్రకారం పేద పిల్లలకు నిర్బంధోచిత విద్య దూరం అవుతుంది. అందువలన తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ బడిని మూత వేయాలన్నా లేదా సంస్కరణ చేయాలన్నా ముందు ప్రైవేటు బడి నియంత్రణ అత్యవసరం. నూతన విద్యా విధానం -2025 సూచన ప్రకారం అంగన్ వాడీ కేంద్రాలు అన్నీ ప్రాథమిక పాఠశాలల్లో విలీనం చేయాలి. 1). ప్రాథమిక పాఠశాలలన్నింటా నర్సరీ తరగతులు, ప్లేస్కూల్స్‌గా మార్పు చేయాలి. 2). ఒక ప్రభుత్వ బడి క్యాచ్‌మెంట్ ఏరియా లోకి ప్రైవేటు బండి రవాణా సౌకర్యాలు నిరోదించాలి. 3). ప్రాథమిక పాఠశాలల అన్నింటా విద్యా కమిషన్ సూచించిన విధంగా ఆంగ్ల మాధ్యమం కూడా ప్రవేశపెట్టితెలంగాణ ఫౌండేషన్ స్కూల్స్‌గా మార్చాలి. 4). విద్యా కమిషన్ సూచనల ప్రకారం ప్రైవేటు పాఠశాలలలో 6వ తరగతి నుండి నీట్, జీ, టోఫెల్ లాంటి ప్రవేశ పరీక్షల ముందస్తు శిక్షణ రద్దు చేయాలి. లేదా అదే తరహా శిక్షణ ప్రభుత్వ బడుల్లో ఏర్పాటు చేయాల్సి ఉంది. 5). ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులు నియంత్రణ తప్పనిసరిగా అమలు చేయాలి. 6). కార్పొరేట్ కళాశాలల పేరుతో పట్టణానికి పది నుండి 20 బ్రాంచీల ఏర్పాటు చేస్తూ ఇచ్చిన పర్మిషన్ లు రద్దు చేయాలి. 7). ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మొదటినుండి చెబుతున్న విధంగా నర్సరీ నుండి ఇంటర్ వరకు పాఠశాలల వ్యవస్థ పునర్వవస్థీకరించాలి. అంటే ఇంటర్మీడియట్ ఉన్నత పాఠశాలలో లేదా జూనియర్ కళాశాలలు ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయాలి.
ఈ చర్యల తర్వాత కూడా ప్రభుత్వ బడిలో నమోదు పెరగనట్లయితే ప్రభుత్వ బడి హేతుబద్ధీకరణ లేదా పాఠశాల సంస్కరణ తప్ప మరో గత్యంతరం లేదు. బడి బాటలు, విద్యా వారోత్సవాలు, ఉచిత డ్రెస్, ఉచిత పుస్తకాలు, మధ్యాహ్న భోజనాలు, అల్పాహారాలు ఇవన్నీ ప్రచారానికి పనికి వస్తాయి, కాకుంటే పేదపిల్లల ఆకలి కొంతమేర తీర్చగలుగుతాయి. కానీ, ప్రభుత్వ బడి బలోపేతానికి తోడ్పడవు. ఎందుకంటే ఇవన్నీ ఎన్నో ఏళ్ళుగా అనుసరిస్తున్న రొటీన్ కార్యక్రమాలు మాత్రమే. ఏ తల్లిదండ్రులైనా తమ పిల్లల భవిష్యత్తు నాణ్యమైన విద్యను మాత్రమే ప్రాథమిక అంశంగా, ప్రధాన అంశంగా నిర్ణయాలు తీసుకొంటారు. అందువలన ప్రభుత్వ బడులు మూతకు ముందు ప్రైవేటు విద్యా వ్యవస్థ విచ్చలవిడి రూపాన్ని నియంత్రించాలి. ఆ పని అనంతరం మాత్రమే ప్రభుత్వ బడి మూత లేదా సంస్కరణ దిశగా అడుగులు వేయాలి. అలా కాకుంటే అనేక అనర్థాలు, సమస్యలు ప్రభుత్వం, ప్రజలకు వెన్నాడే అవకాశం ఉంది. లేదా ప్రైవేటు పాఠశాలలను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ఎయిడెడ్ పాఠశాలలుగా మార్చి, ఆవాస ప్రాంతంలో ఒకే పాఠశాల, అదీ ప్రభుత్వ రంగంలోనో, పర్యవేక్షణ లోనో ఉండేలా చూసుకోవాలి. అలా చేయడం ద్వారా కామన్ స్కూల్ విధానం వైపు ప్రభుత్వం అడుగులు వేయడమేకాక, పరిపూర్ణమైన పాఠశాల సంస్కరణ అమలు జరిపినట్లు అవుతుంది. అలా కాకుండా ప్రైవేటు వ్యవస్థను గాలికి వదిలి ప్రభుత్వ బడిని ఎత్తివేయడం వలన లేదా సంస్కరించడం వలన ప్రభుత్వాలకు ఒనగూడే ప్రయోజనం ఏమీ లేనప్పటికీ, ప్రజలకు మాత్రం అనర్థదాయకం అయిన నిర్ణయం అవుతుంది. ఇది ప్రజల ప్రభుత్వం కనుక పాఠశాల మూసివేత ఆలోచనను ప్రక్కన పెట్టండి, ప్రజల ప్రయోజనం లక్ష్యంగా విద్యా వ్యవస్థ సంపూర్ణ సంస్కరణ చేయాలని, కామన్ స్కూల్ విధానం వైపు అడుగులు వేయాలని ఆశిద్దాం.
ఎన్.తిర్మల్
94418 64514











