హైదరాబాద్: కులాలకు అతీతంగా జరిపే అద్భుతమైన పండుగ బోనాలు అని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. అమ్మకు బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకుంటామని అన్నారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని కెటిఆర్ దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. కెటిఆర్ కు ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికారు. కెటిఆర్ కు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ శాలువా కప్పి సత్కరించి, జ్ఞాపికను బహుకరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. సమైక్య రాష్ట్రంలో బోనాలను పట్టించుకోలేదని, బోనాలను రాష్ట్ర పండుగగా గుర్తించలేదని కెటిఆర్ విమర్శించారు. తెలంగాణ వచ్చాక మాజీ సిఎం కెసిఆర్ బోనాలకు రాష్ట్ర పండుగ హోదా ఇచ్చారని, తెలంగాణ సాధించిందే ఆ తల్లి ఆశీస్సులతోనని కెసిఆర్ చెప్పారని అన్నారు. రాష్ట్రంలోని ప్రతీ గుడికి రూ. 25 కోట్లు విడుదల చేశామని, ఆలయ కమిటీలకు డబ్బులిచ్చి పండుగలను ఘనంగా నిర్వహించామని తెలియజేశారు. రాష్ట్రంలో వర్షాలు బాగా పడాలని తల్లికి మొక్కుకున్నామని, రాష్ట్రం పచ్చగా ఉండాలని, రైతు బాగుండాలని అమ్మను వేడుకున్నామని కెటిఆర్ పేర్కొన్నారు.