
వాణిజ్య సిలిండర్ ధర రూ.192 తగ్గింపు
పెంచిన ధరలు క్రమంగా తగ్గిస్తూ వస్తున్న చమురు సంస్థలు
రెండు నెలల్లో ఇది రెండో భారీ తగ్గింపు
న్యూఢిల్లీ : హోటళ్లు, రెస్టారెంట్లు, తదితర వాణిజ్య సంస్థలకు ఊరట లభించింది. 19 కిలోల వాణిజ్య ఎల్‌పిజి సిలిండర్‌పై ధరలను రూ.192 తగ్గిస్తున్నట్టు చమురు మార్కెటింగ్ సంస్థలు శనివారం ప్రకటించాయి. ఇరాన్ యుద్ధం, పశ్చిమ ఆసియా ఉద్రిక్తతల కారణంగా కొంతకాలంగా వరుసగా పెరిగిన ధరలు.. తాజాగా తగ్గుముఖం పడుతున్నాయి. ఇటీవలి కాలంలో కమర్షియల్ సిలిండర్‌పై ఇది వరుసగా రెండో తగ్గింపు కావడం విశేషం. జులైలో వాణిజ్య సిలింబర్ ధరలను రూ.183 తగ్గించిన సంగతి తెలిసిందే.
శనివారం మరో రూ.192 రూపాయలను తగ్గించారు. దీంతో ఢిల్లీలో 19 కిలోల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధర రూ.202 తగ్గి రూ.2,728కు చేరింది. కోల్‌కతాలో రూ.209 తగ్గి రూ.2,872.50కి చేరింది. మరోవైపు ఐదు కిలోల మార్కెట్ ధరకు సరఫరా చేసే సిలిండర్‌ను రూ.808 నుంచి రూ.762కు తగ్గించారు. ముంబై, చెన్నై, హైదారాబాద్ సహా ఇతర ప్రధాన నగరాల్లో కూడా గణనీయంగా ధరలు తగ్గాయి.
అయితే ఈ తగ్గింపు వాణిజ్య వినియోగ సిలిండర్లకే పరిమితం. గృహ వినియోగదారులు ఉపయోగించే 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పులూ చేయలేదు. దీంతో సాధారణ కుటుంబాలకు ఈసారి ఎలాంటి ఉపశమనం లభించలేదు.ఇక విమాన ఇంధన ధరలను లీటర్‌పై రూ.5 పెంచినట్లు ఇంధన సంస్థలు వెల్లడించాయి. ఇప్పటి వరకు రూ.110 ఉన్న ధర పెంచిన తర్వాత రూ.115కు పెరిగింది.











