హరారే: టీమిండియా యువ జట్టు మరో విజయాన్ని నమోదు చేసింది. దీంతో మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ కైవసం చేసుకుంది. అతిధ్య జింబాబ్వేతో జరుగుతున్న మూడు టి20ల సిరీస్‌లో భాగంగా శనివారం జరిగిన రెండో టి20 మ్యాచ్‌లో టీమిండియా 90 పరుగులు తేడాతో భారీ విజయం సాధించింది. టీమిండియా నిర్ధేశించిన 220 పరుగుల భారీ లక్ష చేధనకు దిగిన జింబాబ్వే 17.5 ఓవర్లలో 129 పరుగులకు కుప్పకూలింది. బ్రియాన్ బెన్నెట్(32), ర్యాన్ బర్ల్(20), మరుమని(24) టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలర్లలో అభిషేక్ శర్మ మూడు వికెట్లు పడగొట్టి అతిధ్య జట్టు నడ్డీ విరచగా.. యశ్ ఠాకూర్2, ప్రిన్స్ యాదవ్ 2 వికెట్లు పడగొట్టారు. రవి బిష్ణోయ్, శివమ్ దూబే, తిలక్ వర్మ తలో వికెట్ దక్కించుకున్నారు.

తిలక్, ఇషాన్ అర్ధ శతకాలు..

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు శుభారంభం దక్కలేదు. మరోసారి అభిషేక్ శర్మ(8) విఫలమయ్యడు. రెండో ఓవర్‌లో ముజర్బానీ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. అభిషేక్ ఔటైనా.. వైభవ్ సూర్యవంశీ(20) చెలరేగాడు. రిచర్డ్ నగర్వా వేసిన మూడో ఓవర్‌లో వరుసగా 4, 6, 4, 4 బౌండరీలు బాది ఆఖరి బంతికి క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. క్రీజులోకి వచ్చిన ఇషాన్ కిషన్(81), శ్రేయస్ అయ్యర్(25) ఆచితూచి ఆడటంతో పవర్ ప్లేలో భారత్ 2 వికెట్లకు 53 పరుగులు చేసింది. తుత నెమ్మదిగా బ్యాటింగ్ చేసిన ఈ జోడీ పరుగుల వరదపారించారు. తనదైన శైలిలో జింబాబ్వే బౌలర్లపై విరుచుకుపడుతూ.. 66 పరుగుల భాగస్వామ్యం అందించారు.

క్రీజులో పాతుకుపోతున్న ఈ జోడీని బ్రియాన్ బెన్నెట్ విడదీసాడు. శ్రేయస్ అయ్యర్‌ను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. క్రీజులోకి తిలక్ వర్మ(60 నాటౌట్) రాగా.. ఇదే అదనుగా ఇషాన్ భారీ షాట్లతో చెలరేగాడు. ఈ క్రమంలో ఇషాన్ కిషన్ 31 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తిలక్ వర్మ కూడా దూకుడుగా ఆడటంతో టీమిండియా స్కోర్ బోర్డు పరుగెత్తింది. 23 బంతుల్లో తిలక్ వర్మ హాఫ్ సెంచరీ సాధించాడు. సెంచరీ దిశగా సాగిన ఇషాన్ కిషన్‌ను న్యూమాన్ న్యమురి క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. దాంతో నాలుగో వికెట్‌కు నమోదైన 94 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. భారీ అంచనాలతో బరిలోకి దిగిన రింకూ సింగ్(12) తక్కువ సోరుకే పెవిలియన్ చేరాడు. శివమ్ దూబే(6 నాటౌట్)తో కలిసి తిలక్ వర్మ భారత్ స్కోర్‌ను 219కి చేర్చాడు.