
న్యూఢిల్లీ: భారత్‌లోని కమ్యూనిస్టులు ‘పూర్తి పిరికివాళ్లు’ అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. కేరళకు చెందిన సీపీఎం పార్లమెంటు సభ్యుడు జాన్ బ్రిట్టాస్‌ను ఉద్దేశించి మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. యూపీఐ పేమెంట్లపై ఛార్జీల విషయంలో దేశ ప్రజల్లో ఆయన గందరగోళం సృష్టిస్తున్నారని ఆరోపించారు. ‘ట్యాక్సేషన్, ఇతర చట్టాల సవరణ’ బిల్లుపై సోమవారంనాడు చర్చ సందర్భంగా బ్రిట్టాస్ కేంద్రంపై ఆరోపణలు గుప్పించారు. అమెరికా ఒత్తిడి వల్లే కేంద్రం యూపీఐపై ఛార్జీలు తీసుకువస్తోందన్నారు. గతంలోనూ బ్రెజిల్‌పై ఒత్తిడి తెచ్చినట్టే భారత్‌లో యూపీఐ సేవలకు రుసుము వసూలు చేయాలని అమెరికా వాణిజ్య ప్రతినిధుల నుంచి ఆర్థిక మంత్రిపై ఒత్తిడి ఉందన్నారు.
డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను ప్రజోపయోగ సేవగా అభివృద్ధి చేసినట్టు ప్రధామంత్రి నరేంద్ర మోదీ 2023 ఫిబ్రవరిలో జరిగిన జీ-20 ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ సమావేశంలో గొప్పగా చెప్పుకున్నారని గుర్తు చేశారు. తాజా బిల్లు అందుకు విరుద్ధంగా, ప్రధాని ఇచ్చిన హామీని ఉల్లంఘించేలా ఉందని తప్పుపట్టారు. దేశం ఎదుర్కొంటున్న ప్రాథమిక సమస్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని అన్నారు. ఐసీయూలో రూపాయి ఉందని, ఢిల్లీలో తీవ్ర అవినీతి వల్లే రూపాయి విలువ పతనమైందని మోదీ 2013లో చెప్పన మాటలను ఆయన గుర్తు చేశారు. ఇప్పడు రూపాయి విలువ ఎంతుంది? అని ప్రశ్నించారు. ఈ క్రమంలో ఆయనకు కేటాయించిన సమయం మించిపోయిందంటూ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ ప్రసంగం నిలిపివేయడంతో బ్రిట్రాస్ సభ నుంచి వాకౌట్ చేశారు.
వినే ధైర్యం లేకనే..
అనంతరం మంత్రి నిర్మలా సీతారామన్ సమాధానమిస్తూ, బ్రిట్టాస్ తన సమాధానం వినకుండా సభను వీడటాన్ని నిలదీశారు. ఇదీ కమ్యూనిస్టుల వ్యవహార శైలి అని, అవాస్తవాలను ప్రచారం చేస్తూ, వాస్తవాలను వక్రీకరిస్తుంటారని తప్పుపట్టారు. మాట్లాడే హక్కు తమకుందని డిమాండ్ చేస్తుంటారనీ, తీరా ఒక్కో ప్రశ్నకు సమాధానం ఇస్తున్నప్పుడు మాత్రం వారికి ధైర్య ఉండదని, పారిపోతుంటారని అన్నారు. ‘పిరికివాళ్లు. దేశంలోని కమ్యూనిస్టులంతా ఇంతే. ఆ విషయాన్ని బ్రిట్టాస్ నిరూపించారు. మాట్లాడే హక్కు ఉందని చెప్పేవాళ్లు అవతల వాళ్లు చెప్పింది కూడా వినాలి కదా’ అని ప్రశ్నించారు.











