
ఎల్‌నినో ప్రభావంతో వెలవెల బోయిన గోదావరి పరివాహక ప్రాంతం భారీ వర్షాలతో జలకళను సంతరించుకుంది. ఉత్తర తెలంగాణలో గత మూడోరోజు కురుస్తున్న వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టడంతో వరదల తీవ్రత తగ్గింది. కానీ ఎగువ నుంచి గోదావరికి వస్తున్న వరదతో పలు చోట్ల రాకపోకలు నిలిచిపోగా వరి, పత్తి, సోయా పంటలు నీట మునిగాయి. శుక్రవారం రాత్రి గోదావరి 51 అడుగులకు మించి ప్రవహిస్తోంది. అధికారులు శనివారం ఉదయం మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. వరద ప్రవాహానికి బూర్గంపహాడ్, చర్ల మండలాల్లో లోతట్టు ప్రాంతాలు నీట మునిగిపోయాయి. చర్ల వద్ద ఇసుక ర్యాంపులో చిక్కుకున్న 50మంది వ్యక్తులను అధికారుల సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఇసుక కోసం వెళ్లగా ఒక్కసారిగా వరద పోటెత్తడంతో ముందుకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. దీంతోనే గోదావరి తీరంలోనే మిషన్ ఆపరేటర్లు, లారీ డ్రైవర్లు, క్లీనర్లు వరదలో చిక్కుకుపోవడంతో నాటు పడవల సహాయంతో వారిని రక్షించారు.
గోదావరి వరదలకు సంబందించిన సమస్యలు తెలిపేందుకు అధికారులు కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. అత్యవసర పరిస్థితుల్లో 7995268352, 08743 232444, 7981219425 నెంబర్లను సంప్రదించాలని అధికారులు కోరారు. కరీంనగర్ జిల్లా దండేపల్లి మండలంలో కన్నెపల్లి, నంబాల గ్రామాల్లో పలు చోట్ల పత్తి, వరి పంటలు నీట మునిగాయి. భారీ వర్షాలకు వరద నీరు పోటెత్తడంతో కడెం ప్రాజెక్టు 13 గేట్లను ఎత్తి నీటిని కిందికి వదిలారు. దీంతో మంచిర్యాల, జగిత్యాల జిల్లాల్లో గోదావరి ఉదృతంగా ప్రవహిస్తోంది. రెండ్రోజులుగా కురిసిన వర్షాలతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రవహిస్తున్న నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. జిల్లాలోని భీంపూర్ మండలం గుబిడి గుండా ప్రవేశించే పెన్ గంగ నది ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం తుమ్మడిహెటి వద్ద ప్రాణహిత నదికి వరదనీరు వచ్చి చేరుతోంది. నిర్మల్ జిల్లా బాసర వద్ద గోదావరి జోరందుకుంది. నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి, సిరికొండ, ధర్పల్లి, మోపాల్, జక్రాన్ పల్లి, ఇందల్వాయి మండలాల్లో కురిసిన భారీవర్షానికి వాగులు వంకలు, చెరువులు, కుంటలు నిండుకుండను తలపిస్తున్నాయి.
బోధన్ నియోజకవర్గంలోని కందకుర్తి త్రివేణి సంగమం వద్ద గోదావరి పరవళ్లు తొక్కుతుంది. నదిలోని శివాలయం నీటమునిగింది. సంగారెడ్డి మండలం కల్పగూర్‌లోని ఉన్నత పాఠశాలలోని రికార్డు గదిలో రేకులు కూలాయి. ఘటన సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. భారీ వర్షాలకు సింగరేణి ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తి పూర్తిగా స్తంభించింది. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్, మందమర్రి, బెల్లంపల్లి ఏరియాలో పలు గనుల్లోకి వరద నీరు చేరడంతో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలిగింది.











