భూ భారతి మంత్రులకు వజ్రాల హారతిలా మారిందని బిజెపి శాసనసభాపక్షం నాయకుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి ధ్వజమెత్తారు. భూ భారతి అవకతవకలపై ఏఐసిసి అగ్ర నేత రాహుల్ గాంధీకి లేఖ రాయనున్నట్లు ఆయన బుధవారం విలేకరుల సమావేశంలో తెలిపారు. వచ్చే నెల 5, 6 తేదీల్లో పెద్ద ఎత్తున నిరసన దీక్షలు చేపట్టనున్నట్లు ఆయన చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించకుంటే అసెంబ్లీ ముట్టడిస్తామని ఆయన తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత నిషేధిత భూముల జాబితా (22ఏ)ను అడ్డుపెట్టుకుని లక్షల కోట్ల రూపాయల కుంభకోణానికి తెరలేపిందని ఆయన ఆరోపించారు.

అంతేకాకుండా రాష్ట్రంలో జరుగుతున్న భూ బదిలీలు, చీకటి ఒప్పందాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఎలాంటి కారణం లేకుండా కొన్ని భూములను 22ఏ జాబితా నుంచి తొలగించి, మరి కొన్ని కొత్త భూములను అందులో చేర్చడం ద్వారా పాలకులే స్వార్థ ప్రయోజనాల కోసం అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆయన మండిపడ్డారు. కుట్రలు జరగవని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుకాయిస్తున్నారని ఆయన విమర్శించారు. కుట్రదారులు ఎవరో ప్రభుత్వం బహిర్గతం చేయాలని ఏలేటి డిమాండ్ చేశారు.