పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం లాగా కేంద్ర ప్రభుత్వం నేషనల్ సెక్యూరిటీ యాక్టు (ఎన్‌ఎస్‌ఎ) నాసా అనే అస్త్రాన్ని బయటకు తీసింది. జాతి విద్రోహులపై ప్రయోగం చేయాల్సిన ఈ నల్లచట్టం పాలుకారే ప్రాయంలో ఉన్న విద్యార్థులు, జెన్‌జెడ్ యువతపై ప్రయోగం చేయనున్నారా? అంటే ఉద్దేశం అదే కావచ్చును. ఇదే నిజమైతే కేంద్ర ప్రభుత్వం నూటికి నూరు శాతం అభద్రతా భావంలోకి జారిపోయినట్లే! కాక్రోచ్‌ల ఆందోళనకు భయపడినట్లే లెక్క? ఈ భయంకరమైన అస్త్రంతో కేసులు బనాయించి కాక్రోచ్ ఉద్యమాన్ని, తద్వారా మద్దతుగా కదులుతున్న ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేసే దిశగా కేంద్ర అడుగులు వేస్తుందా? కనీస విచక్షణాధికారం మరచి ఈ నెల 15నుండి దీన్ని అమలు పర్చుతున్నట్లు ఉత్తర్వులు ఇచ్చింది. అంటే ఈ నెల 20న పార్లమెంటు ముట్టడి పిలుపులో భాగంగా గాయపడిన, కేసులు పెట్టబడిన విద్యార్థులమీద ఈ అస్త్రం వినియోగం చేస్తారా? లేక బెదిరింపులకు ఉపయోగిస్తారా? అనేక కేసులతోపాటు, ఆర్నెళ్ల వరకు ఎలాంటి బెయిల్ రాని ఈ నల్లచట్టం ప్రయోగానికి సిద్ధంకావడంలోని ఆంతర్యం ఏమిటి? కేంద్ర పెద్దలు ఇంత అమానుష ఆలోచన, ఈ దిశగా ప్రయాణం చేయడానికి దారితీసిన పరిస్థితి ఏమిటి?

సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ జులై 20 సంఘటనల వీడియోలు సైతం చూడడానికి నిరాకరించడం, బిజెపి అధికారంలోకి రావడానికి కారణం అయిన అన్నా హజారే సైతం విద్యామంత్రి రాజీనామా చేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వ ప్రతిష్ఠ పెరుగుతుంది తప్ప తరగదని ప్రధాని మోడీకి లేఖ రాసినా కనీస స్పందన లేకపోవడం, నెలకుపైగా కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తున్నా కనీసం వారిని పట్టించుకోకపోవడం, గత 25 రోజులుగా రామన్ మెగసెస్ అవార్డు గ్రహీత, ప్రముఖ పర్యావరణ శాస్త్ర వేత్త సోనమ్ వాంగ్‌చుక్ ఆమరణ నిరహార దీక్ష జరపడంతో పాటు ఆయన తాజాగా ఓ డిమాండ్ కేంద్ర ప్రభుత్వం ముందు ఉంచారు. పార్లమెంట్ ముట్టడిలో పాల్గొన్న విద్యార్థులపై మోపిన కేసులను రద్దుచేసి, నీట్ పేపర్ లీకులపై జంతర్ మంతర్‌లోనే చర్చ జరిపితే తన నిరాహార దీక్ష విరమించుకుంటామని ప్రకటించారు. అయినా ప్రభుత్వంలో ప్రతిస్పందన లేదు. ప్రతిపక్షాలు కూడా కేంద్ర విద్యా మంత్రితో రాజీనామా చేయించాలని పార్లమెంటు లోపలా బయట ఆందోళన చేశారు. ఇన్ని రకాల ప్రతిపాదనలు కేంద్రం ముందుకు వచ్చినా అంతిమంగా బ్రిటీష్ వారి అధికార రక్షణకు ఉద్దేశించిన రౌలత్ చట్టం లాంటి నేషనల్ సెక్యూరిటీ యాక్టు (నాసా)ను విద్యార్థులపై ప్రయోగించడం అంటే ఇది దారుణమైన ఆలోచన, నిర్ణయంగానే చరిత్రలో నిలుస్తోంది.

నల్లచట్టం పెట్టడమే కాదు, దాన్ని జులై 15 నుండి అమలుచేయడం వెనుక ఆంతర్యం ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులపై కక్ష సాధించేదిగా భావించాల్సి ఉంటుంది. లేదా బెదిరింపులో అంతర్భాగం అయి నా అయి ఉంటుంది. ఏదిఏమైనా నాసా ప్రయోగం అనేది విచక్షణ కోల్పోయి జరిపే అణచివేత చర్య అని చెప్పక తప్పదు. ఇక్కడ దాకా జరిగిన పరిణామాల లోతుల్లోకి వెళ్లితే! పశ్చిమబెంగాల్ ఎన్నికల తర్వాత కేంద్ర ప్రభుత్వం లో ఈ రకమైన అతి విశ్వాసం పెరిగింది, రాజ్యాంగ సంస్థలను కనుసన్నల్లో నడుపుకోవడం, అధికారం నుండి అధికారం దిశగా ప్రయాణం చేయడం, నయానో భయానో ఎత్తుగడలో ఏ మార్పుతోనో ప్రతిపక్ష పార్టీలను బలహీనం చేయడం అనే రాజకీయ చదరంగంలో బిజెపి నెగ్గింది. అధికారం సుస్థిరం చేసుకోవడానికి వ్యవస్థలపై ఆధారపడే కంటే చట్టాలను చుట్టాలను చేసుకోవడం సుళువైన మార్గంగా ఎంచుకున్నట్లు ఉంది. ప్రతిపక్షాలు బలహీనం కావడం అంటే దేశంలో ప్రజాస్వామ్య వాతావరణం క్షీణించడమే! అధికారం చేపట్టిన కొద్ది రోజుల్లోనే బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి ఏడాది వరకు బెయిల్ రాని చట్టం తేవాలని యోచిస్తున్నట్లు పేర్కొన్నారు.

తాజాగా కాక్రోచ్, ప్రతిపక్షాల అణచివేతకు కఠినమైన నాసా చట్టం కేంద్రం తెచ్చింది. అంటే దేశంలో ఇంకా జైళ్ళు నోర్లు తెరవబోతున్నాయని అర్థం అవుతుంది. పరోక్షంగా అప్రకటిత ఎమర్జెన్సీకి సిద్ధం అవుతున్న జాడలే కనిపిస్తున్నాయి. ఈ పరిణామాలు కేంద్ర ప్రభుత్వం ఒక క్రమపద్ధతిలో అమలు జరుపుకొంటూ వస్తున్నవే? ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాసమస్యలుపై ఆందోళన సహజమే! అయితే, ఇంత వేగంగా పరిణామాలు మారడం వెనుక ఉన్న పరిస్థితి మరేమీ లేదు. కాక్రోచ్ ఉద్యమం కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరిపైనా, అహంపైనా తిరుగులేని దెబ్బ తీసింది. జులై 20 విద్యార్థుల పార్లమెంటు ముట్టడి తిరుగుబాటుగానే ప్రభుత్వం భావిస్తోంది. జంతర్ మంతర్‌లో కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనకు చాలా కాలం కేంద్రం అసలు స్పందించ లేదు. చాలా తేలిగ్గా తీసుకుంది. ఇక సోనమ్ వాంగ్‌చుక్ నిరాహార దీక్ష 20వ రోజుకు చేరడంతో దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్య వాదులు, ప్రజల్లో కూడా సానుభూతి, కదలిక మొదలైంది. ఆయన్ను బలవంతంగా అరెస్టు చేసి ఆస్పత్రికి తరలిస్తే సమస్య సమసిపోదని అర్థం కావడానికి ఎంతో సమయం పట్టలేదు. కాక్రోచ్ జనతా పార్టీ పార్లమెంటు ముట్టడికి ప్రయత్నం చేయడం, కేంద్రం ఊహకందని రీతిలో విద్యార్థులు ఆటంకాలు అధిగమించి తరలిరావడం, లాఠీచార్జి, బాష్పవాయువు ప్రయోగం చేసినా విద్యార్థులు పార్లమెంటు ముంగిటకు అడుగు పెట్టడంతో కేంద్ర పెద్దలలో అసహనం మొదలైంది. పోలీసులు, విద్యార్థులు గాయపడ్డారు.

తొలిసారి కేంద్ర ప్రభుత్వం ప్రజల్లో పలచనఅయింది. పరాభవ శిరోభారం మోయలేక పోయింది? గోదీ మీడియాను కూడా గుర్తించి విద్యార్థులు వారిని తరిమికొట్టడం కూడా కేంద్ర పెద్దల అహం ఒకింత దెబ్బతింది. కేంద్రం పన్నెండేళ్ళుగా అణచివేత చర్యల్లో తనదైన ముద్ర వేసుకొంది. భీమాకోరెగాం కేసు నుండి అర్బన్ నక్సల్స్ వరకు కఠినమైన కేసులు, చట్టాల ద్వారా మేధావులపై నిర్బంధం విధించడం, జైలుపాలు చేయడం, ఆపరేషన్ కగార్ పేరుతో నక్సల్స్ అణచివేతలో సక్సెస్ కావడం కేంద్ర పెద్దల్లో తిరుగులేని ఆత్మవిశ్వాసం ఏర్పడింది. అయితే అనూహ్యంగా ముందుకు వచ్చిన కాక్రోచ్ ఉద్యమాన్ని అంచనా వేయడంలో కేంద్ర పెద్దలు బోల్తాపడ్డారు. జెల్లపురుగే గదా అనుకుంటే కేంద్రం ప్రతిష్ఠకు జెల్లీ కొట్టింది. ఒకరకంగా జులై 20 విద్యార్థుల, యువత తిరుగుబాటు కేంద్రం విధానాలపై పోరాడే వర్గాల్లో ఆత్మవిశ్వాసం నింపింది. కేసులు, జైళ్ళు, కోర్టులకు భయపడి దూరంగా ఉన్న వివిధ వర్గాలకు కాక్రోచ్ ఉద్యమం ఒక రకంగా ఊపిరి ఊదింది. కేంద్ర మంత్రితో రాజీనామా చేయించి విద్యార్థి ఉద్యమం చల్లార్చి ఉంటే ఈ సమస్య ఇలా జటిలం అయ్యేది కాదు.

నిరంకుశ అధికారాలు దాఖలుపడ్డ కేంద్రం సైతం వెనుకడుగు వేయడానికి ఇష్టపడక పోవడమే కోతి పుండు బ్రహ్మరాక్షసి అయినట్లు సమస్య జటిలం అయింది. ఈ సమస్యను ఇలాగే వదిలేస్తే గడచిన పన్నెండేళ్ళుగా బిజెపి రాజకీయ చాణక్యం తప్ప, ప్రజా సమస్యల ద్వారా ప్రజల్ని తమ వైపు తిప్పుకున్న జాడలు లేవు. ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం పెరగడం, రూపాయి విలువ కుంచించుకుపోవడం లాంటి సమస్యలతో ప్రజల్లో అసంతృప్తి రగులుతున్నది. తాము ప్రజల్లో పలచనైతే కలిగే పరిణామాలు ఏమిటో కేంద్ర వ్యూహ కర్తలకు తెలుసు. ఊహకందనవి కూడా కాదు. కనుక కేంద్రం కఠిన చట్టాల ద్వారా అణచివేత చర్యల వైపే మొగ్గు చూపుతున్నది. నిర్దాక్షిణ్యంగా ఎంతో భవితవ్యం ఉన్న యువతపై కఠిన చట్టాల ప్రయోగం వైపు ప్రభుత్వం ఆలోచనలు చేయడం సరికాదు. కనుక సమస్య తెగేదాకా లాగి, జటిలం అయ్యే దిశగా తీసుకుపోకుండా కేంద్ర ప్రభుత్వంపెద్ద మనస్సుతో ఆలోచనలు చేయాలని, విద్యార్థుల న్యాయమైన డిమాండ్లను పరిష్కారం చేయాలని ఆశిద్దాం.

- ఎన్. తిర్మల్

94418 64514