
నేను, నా సాహితీ యాత్ర: 24 పల్లెటూరిని వదిలి పారిశ్రామిక ప్రాంతానికి వలస వచ్చిన దిగువ మధ్యతరగతికి చెందిన పెద్ద కుటుంబం, తక్కువ అవసరాలతో అదుపు చేసిన కోర్కెలతో పొదుపుగా బతకాల్సిన ఆర్ధిక పరిస్థితి, గోదావరిఖని కార్మిక వాడలలో కుల, మత, ప్రాంతీయ భేదాలు లేని పర్యావరణంలో బాల్యజీవితం, విద్యాభ్యాసం...ఈ నేపథ్యానికి తోడు రకరకాల మనస్తత్వాల వాళ్ళతో సావాసం, నాలో పఠ నం పట్ల ఆసక్తిని పెంచాయి. మా నాయన సింగరేణి బొగ్గుగని కార్మికుడు. రెక్కల కష్టం ఒక్కడిది, తినేనోళ్ళు ఎనిమిది. 10-12 ఏళ్ల వయసులోనే pleasure of reading రుచి మరిగాను. అప్పు డు పుస్తక పఠనం నాకు ఒక ‘ఎస్కేప్ రూట్’. బా లల బొమ్మల కథల పుస్తకాలతో మొదలై, వయసు పెరుగుతున్నా కొద్ది, అభిరుచులు మారుతున్నకొద్ది, అన్ని రకాల వార, మాస పత్రికలు, నవలలు చదవడం హాబీగా మారింది. మధురాంతకం రా జారాం, తిలక్, రావిశాస్త్రి తదితరుల కథలు, పత్రికల్లోని సీరియల్స్ , శ్రీశ్రీ, తిలక్.. తదితరుల కవిత్వం, వాసిరెడ్డి సీతాదేవి, దాశరథి రంగాచా ర్య, మహీధర రామమోహనరావు, కొమ్మూరి వేణుగోపాలరావు వంటి ప్రసిద్ధుల నవలలు నాకు 17 ఏళ్ల వయసు లోపలేపరిచయమైనాయి. ‘పెంకుటిల్లు’ బాగా గుర్తుండి పోయిన నవల. సాహిత్య ప్రయోజనం గురించి ఒక అవగాహన ఏర్పడింది ఆ దశలోనే. పదో తరగతి పూర్తయినాక సెలవుల్లో ‘ఆదర్శం’ అనే కొసమెరుపు ప్రేమ కథ రాశాను. అది ప్రగతి సచిత్రవార పత్రిక,30 జూన్ 1972 సంచికలోఅచ్చయ్యింది.
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పూర్తయినా క, కేంద్రప్రభుత్వ సంస్థ ఐన ‘ది ఫర్టిలైజర్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా’ వారి టెక్నికల్ ట్రైనింగ్ కి ఎంపికై మూడున్నరేళ్ళ శిక్షణ కాలం (1972-75)లో ఇతర ప్రాంతాలు, రాష్ట్రాలు తిరగడం నా జీవితంలో ముఖ్యమైన మలుపు. ఆ శిక్షణలో బోధనా మాధ్యమం స్ట్రిక్ట్‌గా ఇంగ్లీష్. మొద టి సంవత్సరం బేసిక్ ట్రైనింగ్‌లో మాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, జనరల్ ఇంగ్లీష్, ఇంజనీరింగ్ డ్రాయిం గ్, వర్క్ షాప్ టెక్నాలజీ సబ్జెక్టులు కాగా, మిగతా రెండున్నరేళ్ళ ఇంటెన్సివ్ ట్రైనింగ్‌లో ఎరువులు ఉ త్పత్తి చేస్తున్న కార్ఖానాలలో ఉత్పాదక ప్రక్రియల్ని నేరు గా పరిశీలించి, కెమికల్ టెక్నాలజీ పై అవగాహన సాధించడం ప్రధానాంశం.
సింద్రీ (ఝార్ఖండ్), ట్రాంబే (బొంబాయి - మహారాష్ట్ర), రామగుండం ట్రైనింగ్ సెంటర్ లైబ్రరీల లో అనేక రకాల పుస్తకాలు, మ్యాగజైన్‌లు అందుబాటులో ఉండేవి. వారాంతాల్లో రోజంతా లైబ్రరీ లో గడిపేవాడిని. ది స్టేట్స్ మన్, ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్, ఇల్లస్టరేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియా, రీడర్స్ డైజెస్ట్, స్పాన్, ఇంప్రింట్ వంటి పత్రికలు చదువు తూ ఆంగ్లభాష పరిజ్ఞానం పెంచుకున్నాను. వార్ అండ్ పీస్, ట్రైన్ టు పాకిస్తాన్, డాక్టర్ జివాగో, సిద్ధార్థమొదలైన నవలలు చదివి అర్థం చేసుకునేందుకు చాలా శ్రమ పడ్డాను.
1978 నుంచి 1989 వరకు -ఈ దశాబ్ది కాలం నా జీవితంలో కీలకమైనది. ట్రేడ్ యూనియన్ రాజకీయాలు, హేతువాద ఉద్యమ కార్యకలాపాలు. ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ పోరాటాలలో క్రి యాశీలంగా పాల్గొన్నాను. మార్క్సిస్ట్ తత్వశాస్త్ర అధ్యయనం ద్వారా, సంబంధిత పత్రికలు, పుస్తకా లు, రష్యన్ అనువాద సాహిత్యం చదవడం ద్వారా సాహిత్యం పట్ల, జీవిత లక్ష్యం పట్ల ఒక స్పష్టమైన దృక్పథం ఏర్పరచుకున్నాను. టాల్ స్టాయ్, గోర్కీ, చెకోవ్, క్యుప్రి న్, లెవ్రేన్యోవ్ తదితరుల రచన లు, ఇతర భారతీయ భాషా రచనల తెలుగు అనువాదాలు, ప్రపంచ ప్రఖ్యాత కథలు, నవలలు(ఇంగ్లీష్ లో) దొరికినంత మేరకు చదివాను. నిరంతర అధ్యయనశీలత నా స్వభావం. సమూహం తో సంబంధాలు నెరపడం నా నైజం. బహుశ ఇవే నాలో నిద్రాణంగా వున్న రచయితని మేల్కొలిపినాయి. రాయడానికి మనల్ని ప్రేరేపించే స్వీయ వ్యక్తీకరణ కాంక్ష చెకోవ్ కథ ‘Heart ache’ లో అయోనాపోతాపోవ్ తన గుండెలోని దుఃఖభారం దించుకునేందుకు పడిన తపన లాగే బలీయమైనదని నేనను కుంటాను. కథ ద్వారా రచయిత కమ్యూనికేషన్ జాక్ లండన్ కథ ‘The Mexican’ లో లాగా వుండాలని నా అభిప్రాయం.
1989 నుంచి కథలు రాయడానికి ఉపక్రమించాను. అడపాదడపా రాసిన వాటిల్లోంచి 17 కథలను కూర్చి 1997 లో ‘నాలుగు దృశ్యాలు’ సంపు టి ప్రచురించాను. ఈ సంపుటికి ‘రావిశాస్త్రి స్మారక సాహిత్య పురస్కారం’ సహా మరో నాలుగు అవార్డులు లభించాయి. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా 2018లో తెలంగాణా ప్రభుత్వం నుంచి ‘కథా విశిష్ట పురస్కారం’ అం దుకున్నాను. 13 కథల రెండో కథా సంపుటి ‘త్రిభుజపు నాలుగో కోణం’ 2023లో అన్వీక్షికి పబ్లిషర్స్ ప్రచురించారు. మూడు కథ లు ఇతర భాషల్లోకి అనువాదమైనాయి. డజను కథలు పలు ప్రతిష్టాత్మక సంకలనాల్లో చోటు చేసుకున్నాయి.
‘త్రిభుజపు నాలుగో కోణం’ కథ రెండు విశ్వవిద్యాలయాల లో ఎంఏ (తెలుగు) విద్యార్థులకు అధ్యయనాంశంగా వుంది. 1997 నుంచి రాస్తూ వచ్చిన అ నేక సాహిత్య వ్యాసాల్లోంచి 48 వ్యా సాలను ‘దిక్చక్రం’ పేరున 2022 లో ప్రచురించాను. అది ఉత్తమ విమర్శనా గ్రంథంగా నాలుగు సంస్థ ల నుంచి అవార్డులు గెలుచుకున్నది. పదేళ్ళ నుం చి అనువాద వ్యాసంగంలో వున్నాను. ప్రస్తుతం ‘యోజన’(తెలుగు) మాసపత్రికకి ఎంపానెల్ అనువాదకుడిని.
చైతన్య స్రవంతి నాకు ఇష్టమైన టెక్నిక్. ఈ శిల్పం లో రాసిన నాలుగు కథల్లో జీవన్మృతుడు, తిర్యగ్రేఖ, విధ్వంస దృశ్యం నాకు బాగా పేరు తెచ్చా యి. చైతన్యస్రవంతిలో కథ రాయడం ఆషామాషీ పని కాదు,psychological reality ని పాఠకుని కళ్ళ ముందు నిలబెట్టేందుకు రచయిత పాత్రల అంతరంగాలలోకి పరకాయప్రవేశం చేయాల్సి వుంటుంది. ఇది చాలా క్లిష్టమైన పని. వాక్యం కిం ద వాక్యం పేరుస్తూ కవితాత్మక శైలిలో రాస్తే చైత న్య స్రవంతి కాదు. చేతన, సుప్తచేతనలోంచి ఉబికి వచ్చే ఆలోచనలు, జ్ఞాపకాలు, ఊహలు, అనుభూతులు, ఇంద్రియ సంవేదనలతో కలగాపులగంగా కలిసిపోతున్నప్పటి పాత్ర మస్తిష్క వ్యాపార సంపూ ర్ణ వర్ణపటాన్ని పట్టి ఇవ్వడమే చైతన్య స్రవంతి క థనం. ఇందులో పాత్ర(ల) ఆలోచనలు, అనుభూతులు, సంవేదనల ప్రతిబింబంగా బాహ్య ప్రపంచాన్ని దృశ్యమానం చేస్తాడు రచయిత. పాత్ర(ల) inner voice ని వినిపిస్తూ వాటి చర్యలకు, ప్రవర్తనలకు ప్రేరణ లేమిటో కూడా చెబుతాడు.
ఇవాళ్ట్టి రచయితల పరిశీలన శక్తి, రచనాసక్తి మె చ్చుకోదగ్గవి. వారి ప్రయోగానురక్తి నిజంగా ప్రశంసనీయం. రాయాలన్న ఉత్సాహం వుంటేనే సరిపోదు. కథావస్తువు రచయిత ఆలోచనల్లో, ఊహల్లో బాగా మాగినాకే మంచికథగా రూపు దాలుస్తుంది. తన ఫీలింగ్స్ ని, సంఘర్షణని రచయిత కథలోకి బదిలీ చేయగలగాలి. అందుకు అనువైన కథనపధ్ధతి ఎంచుకుని, సరైన సన్నివేశాలు, సంఘటనలను ప్లాట్‌లో పొందు పరచాలి. మరో ముఖ్యమైన విషయం రచయితగా తనకి ఎంత పేరు వచ్చినప్పటికీ విమర్శని ఓపెన్ మైండ్ తో స్వీకరించాలి.

- ఆడెపు లక్ష్మీపతి











