షార్ట్ సర్కూట్‌తో దగ్ధమైన బొమ్మల దుకాణాలు

 గ్రామ పంచాయతీ భవనానికీ వ్యాపించిన మంటలు, కీలక రికార్డులు అగ్నికి ఆహుతి

 కన్నీటి పర్యంతమైన వ్యాపారులు

 ప్రభుత్వానికి నివేదిక పంపించి ఆదుకుంటామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వీరేశం భరోసా

మన తెలంగాణ/నార్కట్‌పల్లి: నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలంలోని పవిత్ర పుణ్యక్షేత్రమైన చెరువుగట్టులో ఆదివారం తెల్లవారుజామున అకస్మాత్తుగా సంభవించిన ఘోర అగ్ని ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. షార్ట్ సర్కూట్ కారణంగా చెలరేగిన మంటలు వరుసగా ఉన్న బొమ్మల దుకాణాలను పూర్తిగా దగ్ధం చేశాయి. వాటికి ఆనుకొని ఉన్న గ్రామ పంచాయతీ కార్యాలయానికి కూడా వ్యాపించిన మంటలు పలు కీలక రికార్డులు బూడిద చేశాయి. ఈ ప్రమాదంలో సుమారు రూ.4 కోట్ల మేర ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు.

జీవనాధారం కోల్పోయిన దుకాణా యజమానులు, వారి కుటుంబాలు నిరాశ్రయులై కన్నీటి పర్యంతమయ్యాయి. ఏండ్ల కష్టార్జితం క్షణాల్లో బూడిద కావడంతో బాధితులు కన్నీరుమున్నీరవుతున్నారు. ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఘటనా స్థలాన్ని సందర్శించి బాధిత కుటుంబాలను పరామర్శించారు. జరిగిన నష్టంపై జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి అన్నివిధాలా ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. వెంటనే నష్టపరిహారం అందించి బాధిత కుటుంబాల పునరావాసానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.

కాగా, ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరుగకపోవడంతో పరమశివుడు, ఆ శివయ్య ఆశీస్సులు మాపై ఉన్నాయని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రమాదంలో కర్నాటి ఎల్లయ్య, రంగా శ్రవణ్ కుటుంబాలు పూర్తిగా వీధినపడ్డాయి. వీరికి సబంధించిన బంగారం, నగదు పూర్తిగా అగ్నికి ఆహుతి కావడంతో ప్రతి ఒక్కరూ చలించిపోయారు.

బాధితులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

ప్రమాద సంఘటనను తెలుసుకున్న నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సంఘటనా స్థలానికి చేరుకొని బాధితులను పరామర్శించారు. కోట్ల ఆస్తి కళ్లముందే కాలిపోవడం బాధాకరమన్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వం తక్షణమే బాధితులకు రూ.20 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.