మన తెలంగాణ/హైదరాబాద్: చాలా కాలంగా ఎడమొహం, పెడమొహంగా ఉన్న ఇద్దరు బిజెపి రాష్ట్ర నాయకులు ఎట్టకేలకు చేతులు కలిపారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్, మల్కాజిగిరి లోక్‌సభ సభ్యుడు ఈటల రాజేందర్ మధ్య సంధి కుదిరింది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి అభయ్ పాటిల్, పార్టీ జాతీయ ఒబిసి మోర్చా అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె. లక్ష్మణ్ చొరవ తీసుకుని ఇరువురి నేతల మధ్య వైరాన్ని తొలగించి సయోధ్య కుదిర్చారు. శనివారం మధ్యాహ్నం తారామతిపేటలోని డాక్టర్ లక్ష్మణ్ నివాసం ఈ సంధికి వేదిక అయ్యింది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి అభయ్ పాటిల్ ఉదయమే నేరుగా లక్ష్మణ్ నివాసానికి చేరుకున్నారు. అనంతరం కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ ఈటల రాజేందర్ అక్కడికి చేరుకున్నారు. మూడు గంటలకు పైగా నలుగురి మధ్య చర్చలు జరిగాయి. కేంద్ర మంత్రి బండి వ్యవహారిస్తున్న తీరుపై ఎంపీ ఈటల తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.

లోగడ తాను ఎమ్మెల్యేగా ఉన్న హుజురాబాద్ నియోజకవర్గానికి వెళితే, బండి సంజయ్ అడ్డు చెప్పడం ఏమిటని ఈటల ప్రశ్నించారు. ఆ నియోజకవర్గంతో తనకు ఉన్న అనుబంధం పేగుబంధం వంటిదని, దానిని తొలగించుకోవడం తేలికైన పని కాదన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కల్పించుకుని ఎవరో చేసిన దానికి తనను నిందించడం భావ్యం కాదన్నారు. ఎంపీ ఈటల పట్ల తనకు మొదటి నుంచీ గౌరవం ఉందని అన్నట్లు తెలిసింది. అయితే ఆ అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీ కమిటీల నియామకం జరిగినప్పుడు తన ప్రమేయం కూడా ఉండాలని మాత్రమే అన్నానని ఆయన చెప్పారు. అభయ్ పాటిల్ మాట్లాడుతూ ఇప్పటి వరకు జరిగిన వాటిని పీడ కలగా మరిచిపోవాలని, రాష్ట్రంలో అధికారంలోకి రావడమే లక్షం పెట్టుకోవాలని సూచించారు. ఇద్దరూ బిసి నాయకులేనని, మీ ఇరువురికీ మంచి భవిష్యత్తు ఉందని, ఇక పాతవి మరచిపోయి చేయి-చేయి కలిపి ముందుకు నడవాలని అభయ్ పాటిల్ వారిని కోరుతూ చేతులు కలిపించారు. వెంటనే డాక్టర్ లక్ష్మణ్ వారికి స్వీట్లు తినిపించారు.


మా మధ్య విభేదాలు లేవు: బండి, ఈటల

చర్చలు ముగిసిన తర్వాత కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ తమ మధ్య ఎటువంటి విభేదాలు లేవన్నారు. మీరు అనుకున్నట్లుగా విభేదాల పరిష్కారం కోసం సమావేశం కాలేదని, ఆ రకంగా టివీల్లో స్క్రోలింగ్ వస్తున్నాయన్నాని వారు తెలిపారు. తాము సమావేశమైంది పార్టీని మరింత బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన అంశాలపై చర్చించడానికేనని వారు దాట వేశారు.