
హైదరాబాద్: ఒక ప్రమాదకరమైన అపోహ ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన నిజాలు ఉన్నాయి. ఛాతిలో నొప్పి వచ్చినప్పుడు చాలామంది వెంటనే ఇసిజి చేయించుకుంటారు. ఇసిజి నార్మల్‌గా వచ్చిందంటే “గుండెపోటు లేదు” అని భావించి ఇంటికి వెళ్లిపోతారు. అయితే ఈ అభిప్రాయం చాలాసార్లు ప్రమాదకరంగా మారవచ్చు. నార్మల్ ఇసిజి వచ్చినంత మాత్రాన గుండెపోటు లేదని ఖచ్చితంగా చెప్పలేము.
ఇసిజి అనేది గుండె విద్యుత్ కార్యకలాపాలను నమోదు చేసే అత్యంత ముఖ్యమైన పరీక్ష. గుండెపోటును గుర్తించడంలో ఇది కీలక పాత్ర పోషించినప్పటికీ, ప్రతి గుండెపోటును మొదటి ఇసిజిలోనే గుర్తించలేము. ముఖ్యంగా స్టెమీ గుండెపోటు ప్రారంభ దశలో ఇసిజిలో ఎలాంటి మార్పులు కనిపించకపోవచ్చు.
కొంతమంది రోగుల్లో కనిపించే నాన్ ఎస్ టి ఎలివేషన్ మయోకార్డియల్ ఇన్ఫారక్షన్ అనే గుండెపోటు రకంలో మొదటి ఇసిజి పూర్తిగా సాధారణంగా ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా గుండె వెనుక భాగం లేదా సర్ కమ్ ప్లెక్స్ కరోనరీ ఆర్టరీ ప్రభావితమైన కొన్ని గుండెపోటులలో కూడా సాధారణ ఇసిజితో నిర్ధారణ కష్టమవుతుంది.
ఎప్పుడు మరింత జాగ్రత్త అవసరం?
ఈ లక్షణాలు ఉంటే ఇసిజి నార్మల్ వచ్చినా నిర్లక్ష్యం చేయకూడదు.
ఛాతిలో బిగుతుగా లేదా నొక్కినట్లు నొప్పి
నొప్పి ఎడమ చేయి, భుజం, మెడ లేదా దవడకు వ్యాపించడం
శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది
చల్లటి చెమటలు పట్టడం
వికారం లేదా వాంతులు
మధుమేహం, అధిక రక్తపోటు లేదా వృద్ధాప్యంలో అసాధారణ లక్షణాలు
ఇలాంటి పరిస్థితుల్లో రోగి లక్షణాలనే ప్రధానంగా పరిగణించాలి. ఇసిజి మాత్రమే ఆధారంగా నిర్ణయం తీసుకోవడం సరైంది కాదు. వైద్యులు సూచించే తదుపరి పరీక్షలతో పాటు రోగి పరిస్థితిని బట్టి వైద్యులు ఈ పరీక్షలు చేయమని సూచిస్తారు.
మళ్లీ మళ్లీ ఇసిజిలు చేయడంతో మొదటి ఇసిజిలో కనిపించని మార్పులు కొంత సమయం తర్వాత బయటపడవచ్చు. 6 నుంచి 12 గంటల తరువాత ఇసిజిలో మార్పులు కనిపించవచ్చు. హై-సెన్సిటివిటీ ట్రోపోనిన్ రక్తపరీక్షతో గుండె కండరానికి నష్టం జరిగిందో లేదో అత్యంత ఖచ్చితంగా తెలియజేస్తుంది. ఎకోకార్డియోగ్రఫీలో గుండె కండరాల కదలికలో లోపాలు ఉన్నాయా అనే విషయాన్ని అంచనా వేయవచ్చు. కరోనరీ యాంజియోగ్రఫీతో అవసరమైతే గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ధమనుల్లో అడ్డంకులు ఉన్నాయో లేదో నిర్ధారించవచ్చును.
గుండెపోటు నిర్ధారణ ఎలా చేస్తారు?
గుండెపోటు నిర్ధారణ ఒక్కఇసిజితో కాదు. వైద్యులు ఈ నాలుగు అంశాలను కలిపి పరిశీలిస్తారు.
* రోగి లక్షణాలు
* ఇసిజి
* ట్రోపోనిన్ రక్తపరీక్ష
* వైద్యుని క్లినికల్ మూల్యాంకనం
ఈ నాలుగు అంశాల సమగ్ర విశ్లేషణ ద్వారానే సరైన నిర్ధారణ సాధ్యమవుతుంది.
ప్రజలకు ముఖ్యమైన సందేశం
“ఛాతిలో నొప్పి ఉన్నప్పుడు ఇసిజి నార్మల్ వచ్చింది కాబట్టి గుండెపోటు లేదని అనుకుని ఇంటికి వెళ్లిపోవద్దు. నొప్పి కొనసాగితే వెంటనే సమీప ఆసుపత్రిని సంప్రదించండి. అవసరమైన పరీక్షలు పూర్తిచేయించుకోండి. సరైన సమయంలో సరైన చికిత్స ప్రాణాలను కాపాడుతుంది.”
ఆరోగ్య సూచన:
నార్మల్ ఇసిజి ఒక మంచి సంకేతం కావచ్చు. కానీ అది గుండెపోటు లేదని ఇచ్చే హామీ కాదు. మీ లక్షణాలే ముఖ్యమైనవి – వాటిని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకండి. “సమయానికి గుర్తిస్తే గుండెపోటును జయించవచ్చు. ఆలస్యం చేస్తే ప్రాణాపాయం తప్పదు.”
డాక్టర్ చింతా ప్రభాకర్ రెడ్డి ఎంఎస్ ఎంసిహెచ్
గుండె, ఊపిరితిత్తుల శస్త్రచికిత్స నిపుణులు
ప్రభుత్వ సర్వజన వైద్యశాల, కర్నూలు








