నీట్ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్నప్పటికీ, ఆయనను పదవి నుంచి తప్పించే ప్రసక్తే లేదని కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా వెల్లడించింది. శుక్రవారంనాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో సాగిన మంత్రివర్గం సమావేశంలో ప్రధాన్‌కు అండగా నిలిచినట్లు తెలుస్తోంది. ప్రభుత్వంలోని అత్యున్నతస్థాయి వర్గాల సమాచారం పేరిట జాతీయ మీడియాలో ఈ మేరకు కథనాలు వెలువడ్డాయి. ‘రాజీనామా చేయించడం అన్నింటికంటే సులభమైన నిర్ణయం. కానీ ప్రభుత్వం మంత్రికి అండగా ఉంది. ప్రజలు మాకు అధికారం అప్పగించారు. వారికి ఇచ్చిన హామీలను నెరవేరుస్తాం’ అని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఉన్నత స్థాయి వ్యక్తి పేర్కొన్నారు.

జాతీయ స్థాయిలో కీలక పోటీ పరీక్షలు నిర్వహిస్తున్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ)లో ఉన్న సమస్యలను గుర్తించి ప్రక్షాళన జరపాలని ప్రభుత్వం భావిస్తోందని తెలిపారు. ప్రశ్నపత్రాల లీకేజీలకు పాల్పడుతున్న అనేక ముఠాల గుట్టు రట్టు చేశామని, మరిన్ని చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నామని తెలిపాయి.శుక్రవారంనాడు ఈ విషయాలు వెల్లడైన కాసేపటికే కేంద్ర ప్రభుత్వం ఎన్‌టిఎ ప్రక్షాళకు నడుం బిగించింది. అందులోని 47మంది అధికారులను తొలగిస్తూ కేంద్ర విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది వారిపై చట్టపరమైన చర్యలకు ఆదేశాలు జారీ చేసింది. లీగల్, క్రిమినల్ చర్యలకు సిఫారసు చేశారు. ప్రక్షాళనలో ఇది తొలి అడుగని, మొత్తం నెల రోజుల్లో ఎన్‌టిఎ ప్రక్షాళన పూర్తవుతుందని విద్యాశాఖ వెల్లడించింది. భవిష్యత్‌లో పేపర్ల లీకులకు అవకాశం లేకుండా ఔట్‌సోర్సింగ్ విధానంలో మార్పులు చేయాలని నిర్ణయించినట్లు తెలిపింది.