అమరావతి: అసాధ్యమన్న వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణాన్ని సుసాధ్యం చేశామని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి ఎన్టిఆర్ వేసిన వివిధ ప్రాజెక్టుల ఫౌండేషన్లను పూర్తి చేసి ప్రారంభించడం తన అదృష్టం అన్నారు. వెలిగొండ నిర్వాసితులకు మరో విడత పరిహారం అందజేశారు. మూడో విడత పరిహారం పంపిణీ చేశారు. రూ.250 కోట్ల పరిహారం చెక్కును నిర్వాసితులకు సిఎం అందజేశారు. ఇప్పటి వరకు నిర్వాసితులకు రూ.768 కోట్లు కూటమి ప్రభుత్వం అందజేసింది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈనెల 31న వెలిగొండ ప్రాజెక్టు తొలిదశను ప్రారంభిస్తామని, 2019లో అధికారంలోకి వచ్చి ఉంటే 2021లోనే ప్రాజెక్టు పూర్తి చేసేవాళ్లమని చంద్రబాబు నాయుడు తెలియజేశారు. గత పాలకులు చేసిన డ్రామాలతో ప్రాజెక్టు సాధ్యం కాలేదని విమర్శించారు. గంగా-గోదావరి-కావేరి అనుసంధానించాలని, సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో ప్రతిపాదించానని సిఎం చెప్పారు. 5 నదులను అనుసంధానిస్తే 4 రాష్ట్రాల్లో సమస్యలు తీరుతాయని, దేశానికే నీటి సమస్య పరిష్కారమై నీటి భద్రత వస్తుందని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.