బిహార్‌లోని పూర్ణయా నియోజకవర్గం ఎంపీ పప్పు యాదవ్‌పై ఆదివారంనాడు దాడి జరిగింది. ఢిల్లీలోని తన నివాసంలో ఆయన మీడియా సమావేశం నిర్వహిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. అయోధ్య రామాలయ విరాళాల చోరీపై కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుని పార్లమెంటు హౌస్ కాంప్లెక్స్ వద్ద పప్పూ యాదవ్ ఇటీవల ఒక స్కిట్ ప్రదర్శించారు. దీంతో మతపరమైన మనోభావాలను గాయపరచారంటూ పప్పూ యాదవ్, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ అవదేశ్ ప్రసాద్‌పై వారణాసిలో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఈ పరిణామాలపై పప్పూ యాదవ్ మీడియా సమావేశంలో మాట్లాడుతుండగా, రాముడిని అవమానించారంటూ ఒక వ్యక్తి ఆయనను నిలదీస్తూ చెప్పు విసిరాడు. దీంతో అతనికి, ఎంపీ అనుచరులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుని ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

హత్యాయత్నమే..

కాగా ఈ ఘటనపై పప్పూ యాదవ్ స్పందిస్తూ, తనపై హత్యాయత్నం జరిగినట్టు చెప్పారు. నిందితుడిని ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌కు చెందిన 34 ఏళ్ల సుమిత్‌గా గుర్తించామని, ఘజియాబాద్‌లో ఇనుప సామానుల వ్యాపారం చేస్తుంటాడని, అతనిపై గతంలో ఎలాంటి నేరచరిత్ర లేదని పోలీసులు తెలిపారు. ఈ ఘటన జరిగినప్పుడు ఎంపీ నివాసం వద్ద పార్కింగ్ చేసిన కారు వద్దనున్న ‘హాపీ’ రెండో వ్యక్తిని కూడా గుర్తించినట్టు చెప్పారు. దాడికి కారణాలపై ప్రస్తుతం పోలీసులు విచారణ జరుపుతున్నారు.